Tuesday, September 19, 2023

ఆశల పల్లకిలో బి ఆర్ ఎస్ నేత‌లు…ఎమ్మెల్సీ పదవుల కోసం పోటా పోటీ…

ప్రభన్యూస్, ప్రతినిధి /యాదాద్రి – తెలంగాణ రాష్ట్రంలో సాధారణ ఎన్నికల సమయం దగ్గర పడుతుంది.. అధికార, ప్రతిపక్ష నేతలు మాటల తూటాలతో ఇప్పటికే రాజకీయం వేడెక్కింది.. మే 27న గవర్నర్ కోటా లో రెండు ఎమ్మెల్సీ స్థానాల ఖాళీ కానున్నాయి.. క్రిస్టియన్ మైనార్టీ నుంచి రాజేశ్వర్ రావు, ముస్లిం మైనార్టీ నుంచి ఫారూఖ్ హుస్సేన్ ల పదవి కాలం పూర్తి కానుంది.. జిల్లా నుంచి గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవుల కోసం ఆశిస్తున్నా ఆశావహుల ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి.. పదవులను ఆశిస్తున్నా వ్యక్తులు రాజకీయాల్లో తలపండిన వారు ఉన్నారు. ఇది వరకే మంత్రి, ఎమ్మెల్యే పదవులను నిర్వహించి పరి పాలన అనుభవం కూడా కల్గి ఉండడంతో ఎవరికి దక్కుతాయో అన్న రాజకీయ ఉత్కంఠ నెలకొంది.. ఎలాగైనా పదవులను దక్కించుకోవాలని లక్ష్యంతో ఎవరికి వారే వారి వారి స్థాయిలలో పోటీ పడుతుండడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి కూడా పెరిగింది..

ఖాళీ కానున్న ఎమ్మెల్సీ స్థానాలు
యాదాద్రి భువనగిరి జిల్లాలో పదవుల కోసం తీవ్రమైన పోటీ ఉంది..గతములో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణా రెడ్డి పదవి కాలం ముగిసింది. మరో సారి అవకాశం జిల్లాకు ఇవ్వలేదు.. మే నెల 27 న గవర్నర్ కోటాలో ఉన్న క్రిస్టియన్ మైనార్టీ నుంచి రాజేశ్వర్ రావు, ముస్లిం మైనారిటీ నుంచి ఫారూఖ్ హుస్సేన్ పదవీ కాలం ముగుస్తుంది.. దీంతో రెండు ఎమ్మెల్సీ స్థానాల ఖాళీలు కానున్నాయి.. రాష్ట్రంలో సాధారణ ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో పోటీ కూడా ఎక్కువయ్యింది.. తలపండిన రాజకీయ నేతలు జిల్లాలో ఉండడంతో తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తూ గులాబీ బాస్ కరుణ కోసం ఎదురు చూస్తున్నారు…

- Advertisement -
   

ఎమ్మెల్సీ పోటీలో హేమా హేమీలు
త్వరలో ఖాళీ కానున్న గవర్నర్ ఎమ్మెల్సీ కోటా పదవుల కోసం యాదాద్రి జిల్లా నుంచి హేమా హేమీలు పోటీలో ఉన్నారు. మంత్రులు, ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీ పదవులు చేసి రాజకీయ తలపండిన వారు ఉన్నారు. జిల్లా నుంచి మాజీ మంత్రులు మోత్కుపల్లి నర్సింహులు, ఎలిమినేటి ఉమా మాధవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, విద్యార్థి ఉద్యమ నాయకుడు తుంగ బాలు ఉన్నారు. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు గులాబీ పార్టీలో సుమారు రెండు సంవత్సరాల క్రితమే పార్టీలో చేరిన మోత్కుపల్లి నర్సింహులుకు ఇప్పటి వరకు ఏ పదవిని తీసుకోలేదు. ప్రభుత్వం అమలు చేసిన దళిత బందుపై విస్తృత ప్రచారం చేసాడు. దళిత బంధు చైర్మెన్ పదవి వస్తుందని అప్పట్లో అందరూ అనుకున్నారు. రాజ్యసభ, ఎమ్మెల్సీ పదవి వస్తుందని అనుకున్నారే తప్ప ఇప్పటి వరకు ఏ పదవి రాలేదు. దీంతో ఎలాగైనా ఎమ్మెల్సీ పదవి దక్కించు కోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మాజీ మంత్రి ఉమా మాధవరెడ్డి తన కుమారుడికి జడ్పి చైర్మెన్ పదవి కట్టబెట్టగా, ఎలిమినేటి కృష్ణా రెడ్డి ఈ మధ్యలో పదవి కాలం పూర్తి చేసాడు. ఈ సారి పదవి కోసం తమ ప్రయత్నాలు ముమ్మరంగానే చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో ఉండిన మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ కూడా తమ ప్రయత్నాల్లో ఉన్నారు. బూడిద బిక్షమయ్య గౌడ్, విద్యార్థి సంఘ నాయకుడు తుంగ బాలు కూడా పదవిని దక్కించుకునే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు…

బీసీలకు కేటాయించేనా..?
మారుతున్న రాజకీయ సమీకరణాల దృశ్య గులాబీ అధినేత ఆచితూచి అడుగులు వేయనున్నారు. జిల్లాలో బీసీ సామాజిక వర్గం అధికంగానే ఉంది. భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ గౌడ సామాజిక వర్గంతోనే గెలుపొందిన దాఖలాలు ఉన్నాయి. మునుగోడు ఉప ఎన్నికల్లో టికెట్ ను ఆశించి భంగపడిన బూర నర్సయ్య గౌడ్ పార్టీ ని వదిలి భాజపా పార్టీలో చేరారు. అప్పటికి భాజపా పార్టీని బలోపేతం దిశగా తీసుకెళ్తున్న బిక్షమయ్య గౌడ్ ను అధినేత కేసీఆర్ స్వయంగా ప్రగతిభవన్ కు పిలుపించుకొని హామీ ఇవ్వడంతో అప్పటికప్పుడే గులాబీ తీర్ధాన్ని పుచ్చుకున్నారు. పదవి తమకే రానున్నట్లు ఆశాభావం వ్యక్తం చేస్తూ తమ ప్రయత్నాలు చేస్తున్నారు. ఉద్యమం లో వెన్నంటి ఉన్న మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ కూడా పదవి కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. బీసీ కోటాలో జిల్లా కు కేటాయిస్తే వీరిద్దరికి అవకాశాలు మెండుగానే ఉన్నాయి..

తుంగ బాలు కు అవకాశం దక్కేనా..?
తెలంగాణ రాష్ట్ర ఏర్పటులో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. రాష్ట్రమంతా విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో బస్ యాత్ర చేపట్టి ప్రజలను ఎంతో చైతన్యం చేశారు. విద్యార్థి నేతలుగా ఉన్న బాల్క సుమన్, గాధరి కిషోర్, పిడమర్తి రవి కి టికెట్ ఇవ్వగా బాల్క సుమన్, గాధరి కిషోర్ రెండు సార్లు గెలుపొందారు. పిడమర్తి రవి ఓటమి పాలవ్వగా కార్పొరేషన్ పదవిని కట్టబెట్టారు. దూదిమెట్ల బాలరాజు యాదవ్ కు కూడా కార్పొరేషన్ పదవి కట్టబెట్టగా చివరగా మిగిలింది తుంగ బాలు మాత్రమే.. రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించి, మిలియన్ మార్చ్, రాస్తారోకో, ధర్నాలో చురుకుగా పాల్గొన్నారు. లాఠీ దెబ్బలు తిని, కేసులలో సహితం ఉన్నారు. అధికారంలో ఉండి 9 సంవత్సరాలు కావొస్తున్న ఇం వరకు ఎలాంటి పదవి ఆశించకుండా ఉన్న తుంగ బాలుకు ఈసారైనా అవకాశం దక్కేనా ఎదురు చూడాల్సిందే.. సాధారణ ఎన్నికల నేపథ్యంలో గులాబీ బాస్ ఆచితూచి అడుగులు వేయనున్నారా అంటే అవుననే సమాధానం వస్తుంది. సీనియర్లకు కేటాయిస్తే మోత్కుపల్లి నర్సింహులు, ఉమామధవ రెడ్డి, బీసీ వర్గానికి అయితే బూడిద బిక్షమయ్య గౌడ్, కర్నె ప్రభాకర్, విద్యార్థి ఉద్యమ నాయకులకు కేటాయిస్తే తుంగ బాలుకు అవకాశం దక్కవచ్చు. పదవుల కోసం ఎవరికి వారే జిల్లా నుంచి తమ ప్రయత్నాలను ముమ్మరంగా చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement