Thursday, April 25, 2024

హరితహారం పేరుతో గిరిజనుల భూములు గుంజుకున్నారుః సీతక్క

దళిత, గిరిజనుల హక్కులను తెలంగాణలో కాలరాస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క మండిపడ్డారు. రాష్ట్రంలో గిరిజనులకు అన్యాయం జరిగిందన్నారు. హరిత హారం పేరుతో కేసీఆర్ గిరిజనుల భూములు గుంజుకున్నారని ఆరోపించారు. ఎస్డీ, ఎస్టీలకు హక్కులు, రిజర్వేషన్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని గుర్తు చేశారు. దేశంలో 12 కోట్ల మంది గిరిజనులు ఉన్నారని, పోడు భూములకు హక్కులు కల్పించింది కాంగ్రెస్ అని తెలిపారు. కేసీఆర్ దళితులను సీఎం చేస్తా అని మోసం చేశారని విమర్శించారు. సబ్ ప్లాన్ నిధులను ఖర్చు చేయడం లేదని మండిపడ్డారు. దళితులు, గిరిజనులకు  ఇచ్చిన సంక్షేమ పథకాలను సబ్ ప్లాన్ కింద చూపించడం అన్యాయం అని ధ్వజమెత్తారు. కేసీఆర్ పాలనలో భూములు, ఉద్యోగాలు, రిజర్వేషన్లు, చదువులు లేవన్నారు. రిజర్వేషన్ల్ ఇస్తామన్న కేసీఆర్ పట్టించుకోలేదని విమర్శించారు. రైతు బంధు, దళిత బంధులన్నీ ఎన్నికల హామీలేనని అన్నారు.

సబ్ ప్లాన్ ప్రకారం నిధులు ఖర్చు చేయాలని సీతక్క డిమాండ్ చేశారు. ఇంద్రవెల్లి వేదికగా జరుగుతున్న ఉద్యమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆగస్ట్ 9వ తేదీ క్విట్ ఇండియా దినోత్సవం, అంతర్జాతీయ గిరిజన దినోత్సవం ఆరోజు ఉద్యమాన్ని ప్రారంభిస్తామన్నారు. భూమి ఒక ఆత్మ గౌరవం.. భూమి మనకు కావాలన్నారు. అమ్ముకోవడానికి భూములున్నాయి కానీ దళితులకు, గిరిజనులకు ఇవ్వడానికి భూములు లేవా ? అని ప్రశ్నించారు. పోడు భూములు రక్షించుకుందామని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉద్యమాలు చేసి పేదలకు న్యాయం చేసిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో పోరాటాన్ని మరింత ఉదృతం చేసి గిరిజన హక్కులను సాధిస్తామని సీతక్క ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement