Thursday, April 25, 2024

నిన్న డ్రైవర్లు.. నేడు ఓనర్లు.. దళిత బంధు ఆస్తుల పంపిణీ

దేశంలోని దళిత బందు గొప్ప పథకం అని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. నిన్న కూలీలు, డ్రైవర్లుగా పనిచేసిన వారు నేడు వాహనాలకు యజమానులుగా మారడం గొప్ప విషయమన్నారు. దళిత కుటుంబాల్లో వెలుగులు నింపేందుకే సీఎం కేసీఆర్ దళిత బంధు పథకం ప్రవేశపెట్టారని చెప్పారు. ఈ పథకంతో దళితులు ఆర్థికాభివృద్ధి సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ స్టేడియంలోని ఇండోర్ స్టేడియం వద్ద తెలంగాణ దళిత బంధు పథకం హుజురాబాద్ నియోజకవర్గ లబ్ధిదారులకు 202 యూనిట్లను రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎంపీ వెంకటేష్ నేత, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ తదితరులతో కలసి పంపిణి చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ నిన్న కూలీలు,  డ్రైవర్లు, క్లీనర్లుగా పనిచేసిన వారు నేడు దళిత బంధు పథకం ద్వారా యజమానులుగా మారడం అభినందనీయమని అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని దారులకు వాహనాలు పంపిణీ చేయడం గొప్ప విషయమని తెలిపారు. దళిత కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు ప్రతి కుటుంబానికి రూ.10 లక్షలు అందజేసిన మహానుభావుడు కే.సి.ఆర్. అని కొనియాడారు.

తెలంగాణ రాష్ట్రం రాకముందు కెసిఆర్ చేసిన సంకల్పం నేడు సాకారమవుతుందని తెలిపారు. సాగునీటి రంగంలో తెలంగాణ రాష్ట్రం అద్భుతాలు సృష్టిస్తుందని, 73 లక్షల మంది రైతులకు అండగా నిలిచిందని అన్నారు. అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తుందని తెలిపారు. బిసి, ఎస్సీ , ఎస్టీ వర్గాలు ఉన్నత చదువులు చదివేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుందని, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. బడ్జెట్లో 17,800 కోట్లు దళిత బందుకు కేటాయించారని తెలిపారు. అన్ని కులాలను ప్రభుత్వం ఆదుకుంటుందని అన్నారు. దళిత బంధు పథకం ద్వారా దళిత కుటుంబాలకు ప్రభుత్వంపై నమ్మకం ఏర్పడిందని అన్నారు. 393 మంది లబ్దిదారులకు 202 యూనిట్లుగా, 76 హర్వెస్టర్లు, 12 జేసిబిలు, 15 డిసిఎం వ్యాన్ లు, 10 ప్యాడి ట్రాన్స్ ప్లాంటర్లు, 4 టిప్పర్ లారీ లు, 3 మినీ బస్సులు, 2 టాటా హితాచి ఎక్సకావేటర్లు,  1 మహీంద్రా స్కార్పియో, 79   గూడ్స్ వాహనాలను  మంత్రులు పంపిణీ చేశారు.  కాగా మొత్తంగా  38 కోట్ల 06 లక్షల 85 వేల 251 రూపాయల (38,06,85,251/-)  విలువ చేసే వాహనాలను లబ్దిదారులకు అందించామని మంత్రి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement