Thursday, April 18, 2024

ఆత్మహత్యలు పరిష్కారం కాదు.. లావణ్య కుటుంబానికి సర్కార్ భరోసా

ఆత్మ‌హ‌త్య‌లు ప‌రిష్కారం కాదు.. ఆత్మవిశ్వాసంతో జీవించాల‌ని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి  సూచించారు. వనపర్తి జిల్లా కేంద్రంలో ఆత్మహత్య చేసుకున్న బీటెక్ విద్యార్థి లావణ్య కుటుంబాన్నిమంత్రి ప‌రామ‌ర్శించారు. ప్రభుత్వపరంగా, వ్యక్తిగతంగా కుటుంబానికి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. స‌మ‌స్య‌లు ఉంటే ప‌క్క‌వారితో పంచుకోవాలి త‌ప్ప మ‌న‌సులో పెట్టుకుని బాధ‌ప‌డొద్దన్నారు. లావ‌ణ్య సోద‌రుడు భ‌ర‌త్‌పై చ‌దువుకు సాయం అందిస్తామ‌న్నారు. ప్రభుత్వ పథకాలలో అర్హత కలిగిన పథకాన్ని వర్తించేలా చర్యలు తీసుంటానని హామీ ఇచ్చారు. ఏ స‌మ‌స్య వ‌చ్చినా త‌న‌ను సంప్ర‌దించాల‌ని లావ‌ణ్య కుటుంబ స‌భ్యుల‌కు మంత్రి నిరంజ‌న్ రెడ్డి సూచించారు.

కాగా, కుటుంబ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో వనపర్తి పట్టణానికి చెందిన బీటెక్‌ సెకండియర్‌ విద్యార్థిని లావణ్య ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. వనపర్తి మున్సిపాలిటీలోని గాంధీనగర్ చెందిన వెంకటయ్య స్థానికంగా వాచ్​మన్‌‌గా జాబ్ చేస్తున్నాడు. ఆయన భార్య ఈశ్వరమ్మ అడ్డా కూలిగా పని చేస్తోంది. వీరికి కూతురు లావణ్య, కొడుకు ఉన్నారు. నిరుపేద దళిత కుటుంబం వీరిది. ఆర్థిక పరిస్థితి ఏ మాత్రం బాగాలేదు. లావణ్య చదువుల్లో టాపర్. పాలిటెక్నిక్‌‌లో 90 శాతంపైగా మార్కులు సాధించింది. ప్రస్తుతం హైదరాబాద్‌‌లో బీటెక్ సెకండియర్ చదువుతోంది. అయితే స్కాలర్ షిప్ పోను రూ.25 వేల దాకా కాలేజీ ఫీజు కట్టాల్సి ఉంది. పరీక్షలు రాసేందుకు సోమవారమే కాలేజీకి వెళ్లాల్సి ఉంది. కానీ రూ.8 వేలు మాత్రమే వెంకటయ్య దంపతులకు అప్పు పుట్టింది.  మొత్తం ఫీజు కట్టేందుకు కావాల్సిన డబ్బు అందలేదు.గడువు దగ్గర పడుతుండటం, తల్లిదండ్రులు తన కోసం కష్టపడటం లావణ్యను ఆవేదనకు గురి చేసింది. ఈ క్రమంలో సోమవారం(జులై 19) మధ్యాహ్నం అప్పు అడిగేందుకు తల్లిదండ్రులు బయటికి వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో సెల్ఫీ వీడియో తీసుకుంది లావణ్య. అమ్మానాన్నలు పడుతున్న ఇబ్బందులను చూస్తూ తాను చదవలేకపోతున్నానని కన్నీళ్లు పెట్టుకుంది. తర్వాత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement