Thursday, March 28, 2024

ట్రాఫిక్ చలాన్ కట్టిన మంత్రి కేటీఆర్.. పోలీసులకు అభినందనలు

హైదరాబాద్ లోని లంగర్ హౌస్ లో గాంధీ జయంతి సందర్భంగా మంత్రి కేటీఆర్ వాహనానికి ట్రాఫిక్ పోలీసులు చలాన్ వేసిన సంగతి తెలిసిందే. వాహనానికి నిబంధనల ప్రకారం చలాన్‌ వేసిన ఎస్‌ఐ ఐలయ్య, కానిస్టేబుల్‌ వెంకటేశ్వర్లను మంత్రి కేటీఆర్‌ అభినందించారు. రాంగ్ రూట్‌లో వచ్చిన మంత్రి వాహనానికి సైతం నిబంధనల ప్రకారం.. చలాన్ విధించిన ట్రాఫిక్ సిబ్బందిని మంత్రి తన కార్యాలయానికి పిలిపించి సన్మానించారు. శాలువా కప్పి, పుష్పగుచ్ఛాలు అందించి సత్కరించారు. మంత్రి కేటీఆర్ తన వాహనానికి విధించిన చలాన్‌ను సైతం చెల్లించారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ సామాన్య ప్రజలు అయినా.. అధికారంలో ఉన్న ప్రజా ప్రతినిధులైనా.. నిబంధనలు అందరికీ ఒక్కటే అని మంత్రి అన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడంలో తాను ఎల్లవేళలా ముందుంటానని.. చలాన్‌ విధించిన రోజు వాహనంలో తాను లేనని కేటీఆర్ చెప్పారు. అయితే, బాపుఘాట్‌లో నిర్వహించిన గాంధీ జయంతి కార్యక్రమం సందర్భంగా అనుకోని పరిస్థితుల్లో రాంగ్‌ రూట్‌లో వచ్చిందని తెలిపారు. విధి నిర్వహణలో నిజాయితీగా వ్యవహరించే ఐలయ్య లాంటి అధికారులకు ఎప్పుడూ తాము అండగా ఉంటామని మంత్రి కేటీఆర్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement