Friday, April 26, 2024

ఇంజనీరింగ్‌ కనీస ఫీజు రూ.45వేలు.. గరిష్ట ఫీజు 1.60లక్షలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్రంలోని ప్రయివేటు ఇంజనీరింగ్‌ కళాశాలల్లో కనీస వార్షిక ఫీజును రూ.45వేలుగా, గరిష్ట ఫీజును రూ.1.6లక్షలుగా టీఏఎఫ్‌ఆర్‌సీ నిర్ణయించింది. వార్షిక ఫీజు ఖరారుపై రాష్ట్రంలోని ప్రయివేటు ఇంజనీరింగ్‌ కళాశాలల యాజమాన్యాలతో గత రెండు రోజులుగా వరుస సమావేశాలు నిర్వహించిన తెలంగాణ ప్రవేశాలు, ఫీజుల నిర్ణాయక కమిటీ (టీఏఎఫ్‌ఆర్‌సీ) ఎట్టకేలకు ఇంజనీరింగ్‌ కనీస, గరిష్ట ఫీజును ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకుంది. గతంలో ఫీజును టీఏఎఫ్‌ఆర్‌సీ ఇబ్బడిముబ్బడిగా పెంచుతూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. పెంచిన ఫీజును సమీక్షించాలని ప్రభుత్వం కోరడంతో తిరిగి టీఏఎఫ్‌ఆర్‌సీ కళాశాలల యాజమాన్యాలను ముఖాముఖి భేటీకి ఆహ్వానించింది. ఈలోపు కొన్ని కళాశాలల యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించి పెంచిన ఫీజును వర్తింప చేయాలని ఉత్తర్వులు తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఇంజనీరింగ్‌ ప్రవేశాల గడువు ముగుస్తున్న సమయంలో టీఏఎఫ్‌ఆర్‌సీ పెంచిన ఫీజులపై ఆరోపణలు వెల్లువెత్తాయి. తాజాగా తీసుకున్న నిర్ణయాన్ని యాజమాన్యాలు అంగీకరిస్తాయా..? లేక మరోసారి న్యాయస్థానం గడపదొక్కి పోరాటానికి సిద్ధమవుతాయా..? అన్నది చర్చనీయాంశంగా మారింది.

అత్యంత విశ్వసనీయవర్గాల కథనం ప్రకారం ఈ విద్యా సంవత్సరం నుంచి వచ్చే మూడేళ్లు టీఏఎఫ్‌ఆర్‌సీ ఖరారు చేసిన ఫీజును యాజమాన్యాలు తీసుకోవాల్సి ఉంటుంది. గతంలో వార్షిక కనీస ఫీజు రూ.35000 ఉండగా దాన్ని రూ.45000కు పెంచారు. అత్యధికంగా ఒక కాలేజీకి రూ.1.60లక్షలుగా నిర్ణయించారు. 25 ఇంజనీరింగ్‌ కాలేజీలకు రూ.లక్షకు పైగా ఫీజును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. టీెఏఫఆర్‌సీ గతంలో నిర్ణయించిన ఫీజుల్లో చాలా కాలేజీలకు కోత విధించగా కొన్ని కాలేజీల ఫీజులను యథాతథంగా అమలు చేయాలని ప్రతిపాదించారు. గండిపేటలోని సీబీఐటీ ఫీజు తగ్గింది. గతంలో సీబీఐటీకి రూ.1.34లక్షలు ఖరారు చేయగా తాజాగా ఉండగా… రూ. 1, 12, 000గా నిర్ణయించినట్లు సమాచారం. ఎంజీఐటీ వార్షిక ఫీజును రూ.1.60లక్షలు నిర్ణయించినట్లు సమాచారం. కాలేజీ యాజమాన్యాల ప్రతినిధులతో టీఏఎఫ్‌ఆర్‌సీ నిర్వహించిన ముఖాముఖి భేటీ సందర్భంగా సమర్పించిన ఆదాయ, వ్యయాలను పరిశీలించిన అనంతరం తాజా ఫీజులను ఖరారు చేశారు. కొత్తగా ఖరారు చేసిన ఫీజుల వివరాల ప్రతిపాదనలను టీఏఎఫ్‌ర్‌సీ శనివారం ప్రభుత్వానికి సమర్పించనుంది.

తమ కళాశాలలకు వార్షిక ఫీజులను ఖరారు చేయాలని కోరుతూ రాష్ట్రంలోని 173 ప్రయివేటు ఇంజనీరింగ్‌ కాలేజీ యాజమాన్యాలు టీఏఎఫ్‌ఆర్‌సీకి దరఖాస్తు చేసుకున్నాయి. ఇందులో 93 కాలేజీలను ముఖాముఖి భేటీలకు ఆహ్వానించారు. టీఏఎఫ్‌ఆర్‌సీ జులైలో ప్రతిపాదించిన ఫీజుల్లో 36 కాలేజీలకు సంబంధించిన వార్షిక ఫీజు లక్ష దాటింది. వీటిలో అత్యధికంగా వార్షిక ఫీజు రూ.1.73లక్షలు ఉండగా, కొన్ని కాలేజీలకు రూ.1.55లక్షలు, మరికొన్ని కాలేజీలకు రూ.1.50లక్షలు, ఇంకొన్ని కాలేజీలకు రూ.1.45లక్షలు వార్షిక ఫీజుగా నిర్ణయించాయి. రాష్ట్రంలో కనీస వార్షిక ఫీజు గతం కంటే రూ.10వేలు పెరగడంతోపాటు కొన్ని కాలేజీలకు గత బ్లాక్‌ పిరియడ్‌ కంటే ఫీజు పెరిగింది. దీంతో విద్యార్థులకు ప్రభుత్వం ఇస్తున్న ఫీజు రియంబర్స్‌మెంట్‌ మూలంగా పెరిగిన కనీస ఫీజుతో ప్రభుత్వ ఖజానాపై భారం పడే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement