Tuesday, April 16, 2024

కంటి వెలుగును సద్వినియోగం చేసుకోవాలి : సంగారెడ్డి క‌లెక్ట‌ర్ శ‌ర‌త్

సంగారెడ్డి : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాలను జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ సూచించారు. కంటి వెలుగు కార్యక్రమంలో 18 సంవత్సరాలు పైబడిన వారందరూ కంటి పరీక్షలు చేయించుకోవాలన్నారు. జిల్లాలో 18 సంవత్సరాలు పైబడిన 17,11,685 మందికి కంటి పరీక్షల నిర్వహణ లక్ష్యంగా 69 బృందాలతో జనవరి 19 నుండి సోమవారం నుండి శుక్రవారం వరకు(ప్రభుత్వ సెలవు దినాలు మినహా) ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు కంటి వెలుగు శిబిరాలలో పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. కంటి వెలుగు రెండో విడత లో భాగంగా ఇప్పటి వరకు (ఫిబ్రవరి,3 నాటికి) జిల్లాలో 1,59,053 మందికి కంటి పరీక్షలు చేసినట్లు తెలిపారు. అందులో 83,448 మంది మహిళలకు,75,469 మంది పురుషులకు కంటి పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు. ఇట్టి శిబిరాల్లో ఇప్పటివరకు 22,274 మందికి రీడింగ్ గ్లాసెస్ ఇవ్వడం జరిగిందని,17,600 మందికి ప్రిస్క్రైబ్డ్ అద్దాలు అవసరమని గుర్తించడం జరిగిందని పేర్కొన్నారు. ప్రిస్క్రిబ్ అద్దాలను వెంటనే ఆర్డర్ చేస్తున్నామని, సంబంధితులకు కంటి అద్దాలు రాగానే అందించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. 1,19,179 మందికి ఏలాంటి కంటి సమస్యలు లేనట్లు గుర్తించారని తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు 41 గ్రామ పంచాయతీ లలో, మున్సిపాలిటీలలోని 17 వార్డులలో పూర్తి స్థాయిలో కంటి పరీక్షలు పూర్తయినట్లు పేర్కొన్నారు. క్యాంపులు నిర్వహించే ప్రదేశాలకు సంబంధించి ఏ రోజు, ఏ గ్రామంలో, ఆయా మున్సిపాలిటీ లలో ఏ వార్డులలో నిర్వహిస్తున్న విషయాన్ని ముందస్తుగా తెలియజేస్తున్నామని పేర్కొన్నారు. శిబిరంలో అవసరమైన వారికి మందులు, కళ్లద్దాలు ఉచితంగా ఇస్తారని తెలిపారు. కంటికి సంబంధించి ఏ సమస్యలున్నా నిర్లక్ష్యం చేయవద్దన్నారు. 18 సంవత్సరాలు పైబడిన వారందరూ కంటి వెలుగు శిబిరాలలో కంటి పరీక్షలు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. అందరి భాగస్వామ్యంతో కంటి వెలుగు కార్యక్రమం విజయవంతం చేయాలని ఆయన కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement