Saturday, April 20, 2024

అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : ఎమ్మెల్యే జీఎంఆర్‌

పటాన్ చెరు : కులం, మతం, వర్గం, ప్రాంతం తేడా లేకుండా నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్ చెరు మండలం ఇంద్రేశం గ్రామ పరిధిలో సొంత నిధులతో కొనుగోలు చేసిన 450 చదరపు గజాలలో నిర్మించ తలపెట్టిన శ్రీకాకుళం సంక్షేమ సంఘం సామాజిక భవన నిర్మాణ పనులకు బుధవారం ఎమ్మెల్యే జిఎంఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆసియాలోనే అతిపెద్ద పారిశ్రామిక వాడగా పేరొందిన పటాన్ చెరు నియోజకవర్గంలో దేశంలోని 28 రాష్ట్రాల ప్రజలతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని వివిధ జిల్లాల ప్రజలు స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారని తెలిపారు. వారందరినీ కన్నబిడ్డల వలె చూసుకుంటున్నామని తెలిపారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు శ్రీకాకుళం జిల్లా వాసులకు 450 గజాల స్థలాన్ని కొనుగోలు చేసి అందించడం జరిగిందని గుర్తు చేశారు. ఇందులో నిర్మిస్తున్న కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణ పనులకు సంపూర్ణ సహకారం అందిస్తున్నామని తెలిపారు. శుభకార్యాలకు, సమావేశాలకు ఈ భవనం ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్ కు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, ఇంద్రేశం గ్రామ సర్పంచ్ నర్సింలు, పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, ఉపసర్పంచ్ బండి శంకర్, సంక్షేమ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement