Tuesday, May 30, 2023

తిరుగులేని శక్తిగా బీఆర్ఎస్ : ఎమ్మెల్యే జీఎంఆర్

అమీన్పూర్ : ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా ఎదిగిన భారత రాష్ట్ర సమితి భవిష్యత్తులో దేశ రాజకీయాల్లోనూ కీలక పాత్ర పోషించనుందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడ మండే మార్కెట్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీరంగూడ రజక సంఘం అధ్యక్షులు మహేష్ ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో యువకులు, మహిళలు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సమక్షంలో భారత రాష్ట్ర సమితిలో చేరారు. ఈ సందర్భంగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 14 సంవత్సరాల పాటు పోరాడి సాధించుకున్న తెలంగాణను నేడు దేశానికి ఆదర్శంగా నిలిపిన మహోన్నత నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆయన నాయకత్వంలో పటాన్చెరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకొని వెళుతున్నామని తెలిపారు. ప్రతిపక్షాలు సైతం అభినందించే విధంగా అభివృద్ధి పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ప్రత్యేకంగా రజకుల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద ఎత్తున నిధులు కేటాయించారని తెలిపారు. నియోజకవర్గంలో ఈ రజకుల సంక్షేమం కోసం మినీ ఫంక్షన్ హాల్ నిర్మించేందుకు చర్యలు తీసుకోబోతున్నట్లు తెలిపారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, భారత రాష్ట్ర సమితి సీనియర్ నాయకుడు గూడెం మధుసూదన్ రెడ్డి, పార్టీ మున్సిపల్ అధ్యక్షులు బాల్ రెడ్డి, ఆయా వార్డుల కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement