Sunday, December 8, 2024

TG | ధాన్యం కొనుగోళ్లలో భారీ అవినీతి… జగదీష్ రెడ్డి

హైదరాబాద్‌ : ధాన్యం కొనుగోళ్లలో భారీ అవినీతి జరిగిందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ… పత్తి, వరి ధాన్యం కొనుగోలు విషయంలో రైతులతో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆడుకుంటున్నది. సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ చేస్తున్నట్లు డ్రామాలు ఆడుతున్నారని సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఫైర్‌ అయ్యారు. కొనుగోళ్లు జరపకుండా పథకం ప్రకారం రైతులను దళారీలకు, మిల్లర్లకు వదిలేశారని విమర్శించారు. దీని వెనుక వందల కోట్ల అవినీతి జరిగింది. ప్రభుత్వంలో మంత్రులు దళారులు, మిల్లర్లతో కుమ్మక్కు అయ్యారని మండిపడ్డారు.

పదేళ్ల కాలంలో కేసీఆర్ పండిన ప్రతి గింజను కొన్నారు. నల్గొండ జిల్లా మంత్రి రైతుల వద్ద ధాన్యం కొనకుండా అధికారులను బెదిరించారు. జిల్లా మంత్రి దళారులతో కుమ్మక్కై వందల కోట్లు వసూలు చేశారన్నారు. 2014 కు ముందు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు మళ్లీ వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు ఎందుకు దోపిడీకి గురి అవుతున్నారో సీఎం, వ్యవసాయ శాఖ మంత్రి సమాధానం చెప్పాలన్నారు.ఇప్పటి వరకు ఒక్క గింజ సన్న వడ్లు ప్రభుత్వం కొనలేదని, సమాధానం చెప్పడానికి అధికారులు భయపడుతున్నారని తెలిపారు.

ప్రజలు మర్చిపోయారు అంటున్న కేసీఆర్‌ను చూసి రేవంత్ రెడ్డికి ఎందుకు భయం అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో ప్రజల తిరుగుబాటు మొదలయిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీని వాడుకుని రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు రేవంత్ రెడ్డిని చూసి భయపడుతున్నారని చెప్పారు. కలెక్టర్ మాపైన దాడి జరగలేదని చెప్పారు. ప్రభుత్వం కేసులు ఎందుకు పెడుతున్నదని ప్రశ్నించారు. రాష్ట్రంలో మేధావులు కొడంగల్‌కు వెళ్లి రావాలని హితవు పలికారు. కొడంగల్ నియోజకవర్గంలో అధికారులను అడ్డుకోవాలని బీఆర్ఎస్ పిలుపు ఇవ్వలేదని స్పష్టం చేశారు.

- Advertisement -

ఢిల్లీకి 25 సార్లు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి ఎవరి కాళ్లు మొక్కారో ప్రజలకు తెలుసన్నారు. కేటీఆర్ ఢిల్లీకి వెళ్లింది కాంగ్రెస్, బీజేపీ పార్టీల బండారం బయటపెట్టడానికి అని పేర్కొన్నారు. ఎవిడెన్స్ కోసం బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. దానికి మాజీ ఎమ్మెల్యేలు సమాధానం ఇస్తారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అవినీతిపై బండి సంజయ్, కిషన్ రెడ్డి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర మంత్రిపై జరిగిన ఈడీ రైడ్స్ ను ఎందుకు బయటపెట్టలేదు? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రేవంత్ రెడ్డి వీపు పగలగొట్టడం ఖాయమన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement