Wednesday, April 24, 2024

పంట నష్టంపై నివేదికలు తయారు చేయండి.. రైతులకు నష్టపరిహారం అందేలా చూస్తాం: ఎమ్మెల్యే దాసరి

అకాల వర్షాలతో జరిగిన పంట నష్టంపై వ్యవసాయ అధికారులు యుద్ధ ప్రాతిపదికన నివేదికలు తయారు చేయాలని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆదేశించారు. శనివారం కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పలు గ్రామాల్లో వడగండ్ల వానతో నేలకొరిగిన మొక్కజొన్న, మిర్చి, పసుపు పంట లను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ నియోజకవర్గంలోని కాల్వ శ్రీరాంపూర్ మండలం మంగపేట, కునారం, గంగారం, పెగడపల్లి, మడిపల్లి, శ్రీరాంపూర్, పెద్దంపేట, పందిళ్ళ, మల్యాల, ఎలిగేడు మండలం లోని ధూళికట్ట, ముప్పిడితోట, ర్యాకల్ దేవపల్లి, నర్సాపూర్, ఎలిగేడు, భూరహాన్ మియపెట్.. జూలపల్లి మండలం లోని కుమ్మరికుంట, అబ్బాపూర్, వడకపూర్, కాచాపూర్, తేలుకుంట, పెద్దాపూర్, ఓదెల మండలం లోని నాంశానిపల్లి, కొలనూరు,పెద్దపల్లి మండలం లోని మూలసాల గ్రామాల్లో పంట నష్టం జరిగిందన్నారు.

నియోజకవర్గంలో సుమారు వెయ్యి ఎకరాలకు పైగా పంట నష్టం వాటిల్లిందని, ఆరుగాలం కష్టించి పండించిన పంట అకాల వర్షాలతో నష్టపోయి రైతాంగం పరిస్థితి దయనీయంగా తయారైందన్నారు. వ్యవసాయ అధికారులు వెంటనే పంట నష్టంపై నివేదికలు తయారుచేసి ప్రభుత్వానికి అందజేయాలన్నారు. రైతాంగానికి నష్టపరిహారం అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తెరాస ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement