Wednesday, November 27, 2024

MBNR: భారీ వర్షంతో పొంగిన వాగులు వంకలు.. రాకపోకలు బంద్..

గద్వాల (ప్రతినిధి) ఆగస్టు 20 (ప్రభ న్యూస్) : జోగులాంబ గద్వాల జిల్లాలో సోమవారం మధ్యాహ్నం, మంగళవారం మధ్య రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి జిల్లాలో అనేకచోట్ల వాగులు, వంకలు, పొంగిపొర్లుతున్నాయి. చాలా గ్రామాలకు రాకపోకలు కూడా నిలిచిపోయాయి. అల్లంపూర్ నియోజకవర్గంలోని ఐజ మండల కేంద్రం నుంచి ఐజకు సమీపంలోని ఐజ నుండి కర్నూలు వెళ్లే – కర్నూల్ నుండి ఐజ, రాయచూరుకు వెళ్లే ప్రధాన రహదారిపై భారీ వర్షానికి వాగు పొంగిపొర్లుతున్నది.

ఐజ నుండి కర్నూల్ కు వెళ్లే రోడ్డులో గల పెద్దవాగు గతంలో ఎప్పుడూ కూడా చూడనివిధంగా ఇలా బ్రిడ్జి ఎక్కి వరదనీరు పారడం మొదటిసారని, నిండుకుండలా దాదాపు అర‌కిలోమీటర్ కు పైగా ప్రవహిస్తుందని, దయచేసి వాహనదారులు, ప్రయాణీకులు గమనించగలరని ఐజ పట్టణ గ్రామస్తులు వాహనదారులకు తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఐజ మండలంలోని ఉత్తనూర్ గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న వాగు ఉదృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. వరదనీరు ఎక్కువగా ఉన్నా ట్రాక్టర్ యజమాని లెక్కచేయకుండా వాగు దాటేందుకు ప్రయత్నం చేయగా.. మధ్యలో ఆగిపోవడం జరిగిందని అక్కడ గ్రామస్తులు తెలిపారు.

అంతేకాకుండా గట్టు మండలంలోని బోయలగూడెం గ్రామానికి మధ్యలో ఉన్న పెద్దవాగు వరదనీటి కారణంగా ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇటు వైపు ఉన్న గ్రామస్తులు ఇందువాసి మీదుగా రాకపోకలు కొనసాగిస్తున్నట్లు అక్కడి గ్రామస్తులు తెలిపారు. జిల్లాలో అనేకచోట్ల వాగులు, వంకలు, పొంగి పొర్లుతుండడంతో ఆయా ప్రాంతాల్లో పోలీస్ ల పర్యవేక్షణ ఏర్పాటు చేయాలని గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement