Friday, March 15, 2024

టీకా తీసుకున్న మంత్రి శ్రీనివాస్‌ గౌడ్..

మహబూబ్‌నగర్‌ : కరోనా వైరస్‌ నివారణలో భాగంగా 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కోవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకోవాలని రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రదాన ఆసుపత్రిలో మంత్రి కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. కరోనా కట్టడిలో భాగంగా ప్రభుత్వం వ్యాక్సిన్‌ వేస్తున్నదని , కో వ్యాక్సిన్‌ , కోవి షీల్డ్‌ రెండు రకాల వాక్సిన్‌లు పూర్తి స్థాయిలో జిల్లాలో తగినంత లభ్యతలో ఉన్నాయని , అందువల్ల సీనియర్‌ సిటిజన్లు , 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు వాక్సిన్‌ వేయించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కరోనా పట్ల నిర్లక్ష్యం చేయవద్దని , లక్షణాలు కనిపించిన వెంటనే డాక్టర్‌ను సంప్రదించి చికిత్స తీసుకోవాలన్నారు. మంత్రితో పాటు తల్లి శాంతానారాయణగౌడ్‌ , సోదరుడు శ్రీకాంత్‌ గౌడ్‌లు వ్యాక్సిన్‌ తీసుకున్నారు. వ్యాక్సిన్‌ తీసుకున్న అనంతరం సుమారు అర్థగంట సేపు మంత్రి ఆసుపత్రిలోనే వేచి ఉండే గదిలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరిండెంట్‌ , ఇంజనీర్లు , ఆసుపత్రి అభివృద్ది కమిటీ సభ్యులతో జిల్లా ఆసుపత్రి అభివృద్దిపై చర్చించారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్‌ డా.రామ్‌ కిషన్‌ , జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి డా.శంకర్‌ , డిప్యూటి సూపరింటెండెంట్‌ డా.జీవన్‌ , ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు వెంకన్న తదితరులు మంత్రి వెంట ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement