Thursday, November 7, 2024

MBNR: బంగ్లాదేశ్ లో హిందువులపై ఊచకోతలను అరికట్టాలి… ఎమ్మెల్యే శ్రీహరి

మక్తల్, ఆగస్టు 12 (ప్రభ న్యూస్) : బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న ఊచకోతలను అరికట్టి, వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంద‌ని మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ బంగ్లాదేశ్ ఘటనలపై అందరికన్నా ముందుగా స్పందించి ఖండించడం జరిగిందని గుర్తు చేశారు. ఇవాళ కర్ణాటక రాష్ట్రం నుండి తెలంగాణ రాష్ట్రంలోకి నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలోకి ప్రవేశించిన రాజీవ్ గాంధీ జ్యోతి సద్భావన యాత్రకు కృష్ణా మండలంలోని కృష్ణా చెక్ పోస్ట్ వద్ద డీసీసీ అధ్యక్షులు కే .ప్రశాంత్ కుమార్ రెడ్డితో కలిసి ఘనంగా స్వాగతం పలికారు.

ఈసందర్భంగా పార్టీ నాయకులతో కలిసి బైక్ ర్యాలీలో గుడెబల్లూర్, మాగనూర్, చందాపూర్ మీదుగా మక్తల్ పట్టణం వరకు కొనసాగింది. ఈ సందర్భంగా పట్టణంలోని 167వ జాతీయ రహదారిపై ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… 33 సంవత్సరాలుగా రాజీవ్ గాంధీ జ్యోతి సద్భావన యాత్ర దేశ శాంతిని ఆకాంక్షిస్తూ కొనసాగుతుందన్నారు. కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణతో పాటు మొత్తం ఎనిమిది రాష్ట్రాల్లో యాత్ర కొనసాగుతుందన్నారు. ఈ నెల 20న ఢిల్లీలోని వీర్ భూమికి రాజీవ్ గాంధీ జ్యోతి సద్భావ యాత్ర చేరుకుంటుందని అక్కడ కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీలకు ఈ జ్యోతి అందదజేయడం జరుగుతుందని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి తెలిపారు.

దేశంలో ఐక్యత, దేశ సమగ్రత కోసం కాంగ్రెస్ పార్టీ పని చేస్తుందన్నారు. రాజీవ్ గాంధీ స్పూర్తి కొనసాగించాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడోయాత్ర మక్తల్ నియోజకవర్గంలో కొనసాగిందని, ఇవాళ‌ రాజీవ్ గాంధీ జ్యోతి సద్భావన యాత్ర కూడా మక్తల్ నియోజకవర్గంలో కొనసాగడం హర్షణీయమన్నారు. రాజీవ్ గాంధీ జ్యోతి సద్భావన యాత్రకు ఘన స్వాగతం పలికి విజయవంతం చేసిన కాంగ్రెస్ శ్రేణులకు ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జి.గోపాల్ రెడ్డి, జి.లక్ష్మారెడ్డి, బోయ రవికుమార్, బి.గణేష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement