Wednesday, April 17, 2024

ఏటీఎం లూటీ కేసులో అంతర్రాష్ట్ర దొంగలు అరెస్ట్..

మహబూబ్ నగర్ క్రైమ్, ఫిబ్రవరి 28 (ప్రభ న్యూస్) : రాజాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫిబ్రవరి 10వ తేదీన జరిగిన ఏటీఎం దొంగతనం కేసులో ఇద్దరు అంతర్ రాష్ట్ర దొంగలను పట్టుకొని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు జిల్లా ఎస్పీ కే.నరసింహ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మంగళవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దొంగలను ప్రవేశపెట్టి వివరాలను వెల్లడించారు. ఎస్పి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. రాజాపూర్ లో గల టాటా ఇండిక్యాష్ ఏటీఎంలో ఈనెల 10వ తేదీన 7లక్షల 82 వేల రూపాయలు దొంగలు ఎత్తుకెళ్లినట్లు వెల్లడించారు. అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ఫిబ్రవరి 15వ తేదీన రాజాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టామని ఆయన చెప్పారు. ఇందులో భాగంగా మంగళవారం బాలనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఏటీఎం దగ్గర అనుమానాస్పదంగా తిరుగుతున్న పంజాబ్ రాష్ట్రం బటిండా జిల్లాకు చెందిన గుర్ గగన్ సింగ్, భూపేందర్ సింగ్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి విచారించగా అసలు విషయం బయటపడిందని ఆయన చెప్పారు. వీరిలో రష్ పాల్, సందీప్ సింగ్ అనే మరో ఇద్దరు వ్యక్తులు పరారిలో ఉన్నట్లు వెల్లడించారు. అయితే ఈ అంతరాష్ట్ర దొంగలు ముఠాగా ఏర్పడి జల్సాలకు అలవాటుపడి విలాసవంతమైన జీవితం గడపడానికి ఏటీఎంలను టార్గెట్ చేసుకొని దొంగతనాలకు పాల్పడేవారని వివరించారు. వీరిపై గతంలో కూడా అనేక ప్రాంతాల్లో కేసులున్నాయని తెలిపారు. అయితే భూపేందర్ సింగ్ అనే నిందితుడు బీసీఏ కోర్స్ (బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్) పూర్తిచేసి ఏటీఎంలో నగదు లోడ్ చేయడంలో, మిషన్ లో రిపేర్ నైపుణ్యం కలిగి ఉండడమే కాక 15 సంవత్సరాలు ఏటీఎం టెక్నీషియన్ గా పని చేశాడన్నారు.

అందులో వచ్చే జీతం సరిపోక ఏటీఎంలో సాఫ్ట్వేర్ ను ఉపయోగించి దొంగతనం చేయాలని నిర్ణయించుకొని ఏటీఎం మెషిన్ నగదు పెట్టే సమయంలో క్యాష్ బాక్స్ పాస్ వర్డ్ తెలుసుకునేందుకు వైఫై మైక్రో కెమెరా బిగించి కొంత దూరంలో ఉండి పాస్ వర్డ్ వీడియో ద్వారా సేకరించి దొంగతనాలకు పాల్పడ్డారని వెల్లడించారు. ఇదే తరహాలో ఈనెల 10వ తేదీన మధ్యాహ్నం సమయంలో రాజాపూర్ ఏటీఎంలో నగదు లోడ్ చేసేటప్పుడు దొంగలు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి క్యాష్ లోడ్ చేసి వెళ్లిన పది నిమిషాల్లోపే దొంగతనం చేసి 7,82,000 నగదు దోచుకెళ్లారని అన్నారు. తిరిగి ఆ క్యాష్ బాక్స్ ను అదే పరిజ్ఞానంతో క్లోజ్ చేయడం వల్ల ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చిందని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారు ఉపయోగించే కారు ఫాస్ట్యాగ్ ఆధారంగా దొంగలను గుర్తించామని పేర్కొన్నారు. కాగా పట్టుబడ్డ నేరస్తుల నుండి రూ.5 వేలు నగదు, ఒక కారు, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ అన్నారు. వీరిపై పీడియాక్ట్ కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించామని పేర్కొన్నారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించి దొంగలను పట్టుకున్నందుకుగాను డీఎస్పీ మహేష్, జడ్చర్ల రూరల్ సిఐ జములప్ప, సి సి ఎస్ సిఐ ఇఫ్తాకార్, బాలనగర్ ఎస్సై, రాజాపూర్ ఎస్సై లను అభినందించి రివార్డులను అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement