Friday, March 15, 2024

రైతుల కోసం దిగివచ్చిన సర్కార్…

మహబూబ్‌నగర్‌ : గత యేడాది కరోనా ప్రభావంతో గ్రామీణ కేంద్రాల్లో వరి ధాన్యం కొనుగోలు చేసేందుకు సర్కార్‌ ఐకేపి , పిఎసిఎస్‌ల ద్వార వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యాన్ని సేకరించింది. వాటిని కొనసాగించేందుకు ఈ యాసంగిలో సర్కారు కొంత విముఖత వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అన్ని వర్గాల నుంచి రైతుల దగ్గర వరిని కొనుగోలు చేయాలంటూ సర్కార్‌పై ఒత్తిడి పెరగడంతో ఈ యాసంగిన జిల్లా వ్యాప్తంగా సాగైన 1,20,097 ఎకరాల వరి ధాన్యంలో సగటు కొనుగోలుకు సర్కార్‌ సిద్దమయ్యింది.ఈ నిర్ణయంతో మధ్యదళారులకు సర్కారు షాక్‌ ఇచ్చినట్లయింది. అధికారులు పాలమూరు జిల్లా వ్యాప్తంగా వరి కొనుగోలు చేసేందుకు 175 కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. ఏప్రిల్‌ 15వ తారీఖు తర్వాత కేంద్రాలను ఏర్పాటు చేయడానికి సర్వం సిద్దం చేస్తుంది సర్కార్‌. కొనుగోలు కేంద్రాలు వివిధ శాఖల పరిధిలో ఏర్పాటు చేయనున్నారు. ఐకేపి పరిధిలో 107 కేంద్రాలు , పిఎసిఎస్‌ పరిధిలో 61 కేంద్రాలు , మార్కెటింగ్‌ , ఇతర శాఖల ఆధ్వర్యంలో మిగతా కేంద్రాలు అందుబాటులోకి రానున్నాయి. యాసంగిలో సాగైన వరి ధాన్యాన్ని అంచనాగా దిగుబడి 2,42,023 మెట్రిక్‌ టన్నులుగా అధికారులు అంచనా వేశారు. ఉత్పత్తి ధాన్యంలో 70 శాతం పైగా సర్కారు వరి కొనుగోలు కేంద్రాలకు రానున్నట్లుగా తెలుస్తుంది. వరి కొనుగోలు కేంద్రాల్లో సర్కార్‌ రాబోయే వరి ధాన్యాన్ని అంచనా వేసి కావాల్సిన గన్నీ బ్యాగులు 45 లక్షలకు పైగా అందుబాటులో ఉంచనున్నారు. ప్రస్తుతం గత యేడాది వరి కొనుగోలు కేంద్రాలకు ఉపయోగించిన 12.20 లక్షలుగా అందుబాటులో ఉన్నాయి. వివిధ శాఖల విభాగాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న వరి కొనుగోలు కేంద్రాలకు యాసంగిలో రికార్డు స్థాయిలో వరి సాగవడంతో అదే స్థాయిలో వరి ధాన్యం కూడా కొనుగోలు కేంద్రాలకు రానుంది. సర్కార్‌ తీసుకున్న నిర్ణయంతో దళారుల్లో దడ మొదలైంది. ఈ దఫా యాసంగిలో సర్కార్‌ వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయదనుకుని సంబురపడ్డ మధ్య దళారులకు సర్కారు షాకిచ్చింది. సర్కార్‌ నిర్ణయంతో ప్రతియేటా 50 శాతానికి పైగా దళారుల బారిన పడే రైతన్నలకు సర్కారు మేలు చేసినట్లయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement