Tuesday, March 26, 2024

డిసెంబ‌ర్ 4న‌ మహబూబ్ నగర్ లో సీఎం కేసీఆర్ ప‌ర్య‌ట‌న..

మహబూబ్ నగర్ : డిసెంబ‌ర్ 4న‌ సీఎం కేసీఆర్ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో పర్యటించనున్నట్లు రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, పురావస్తు, క్రీడలు, సాంస్కృతిక, యువజన సర్వీసుల శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. నూతన సమీకృత కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి జిల్లా కేంద్రానికి వస్తున్నారని ఆయన అన్నారు. జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి పాల్గొనే భారీ బహిరంగ సభకు సంబంధించి ఎంవిఎస్ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… రాష్ట్రం రాకముందు ఇదే గ్రౌండ్ లో స్వరాష్ట్రం కోసం సీఎం కేసీఆర్ సమావేశం జరిగిందని, ఇప్పుడు మళ్లీ ఇక్కడే రాష్ట్రం ఏర్పడ్డాక భారీ బహిరంగ సభ నిర్వహించుకుంటున్నామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అన్ని జిల్లా స్థాయి ప్రభుత్వ కార్యాలయాలు ఒకే చోట కొలువై ప్రజలకు సేవలందించే విధంగా తీర్చిదిద్దిన ఘనత దేశంలో ఒక్క మన రాష్ట్రంలో మాత్రమే సాధ్యమైందని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ముందు చూపుతో అన్ని జిల్లా కేంద్రాల్లో సమీకృత కలెక్టరేట్ భవనాల నిర్మాణాలు చేపట్టారన్నారు. ఇందువల్ల ప్రజలు ఎన్ని పనులున్నా ఒకేచోట పూర్తయ్యేందుకు అవకాశం లభిస్తుందని తెలిపారు. కలెక్టరేట్ కోసం హైవే పక్కనే స్థలం లభించడం అదృష్టమని, ప్రజలందరికీ అందుబాటులో అధికారులు ఉండనున్నారని తెలిపారు.


పలు అభివృద్ధి పనులు సైతం…
కొత్త కలెక్టరేట్ ప్రారంభోత్సవంతో పాటు పాత కలెక్టరేట్ స్థానంలో నిర్మించనున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తారని మంత్రి తెలిపారు. ఒక్క ఏడాదిలో పనులు పూర్తి చేసి, ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు. బస్టాండ్ సమీపంలో నిర్మించిన పార్టీ కార్యాలయాన్ని కూడా ముఖ్యమంత్రి ప్రారంభిస్తారన్నారు. మినీ ట్యాంక్ బండ్ వద్ద చేపట్టే వివిధ అభివృద్ధి పనులకు కూడా శంకుస్థాపన కార్యక్రమం ఉంటుందన్నారు. డిసెంబర్ నెలలోనే నర్సింగ్ కళాశాల ప్రారంభం అవుతుందని ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మంత్రి వెంట కలెక్టర్ వెంకట్రావు, అడిషనల్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, జిల్లా అధికారులున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement