Friday, April 19, 2024

చెక్‌లు..నియామక పత్రాలు..

మహబూబ్‌నగర్‌ : కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నదని రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి డా.వి.శ్రీనివాస్‌ గౌడ్‌ చెప్పారు. మహబూబ్‌నగర్‌ లోని తన క్యాంపు కార్యాలయం వద్ద జిల్లా కార్మిక శాఖ ఆధ్వర్యంలో లబ్దిదారులకు రూ.45 లక్షల 43,268 విలువ చేసే చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కార్మికులను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మిక శాఖ అమలు చేసే పథకాలలో అనేక మార్పులు వచ్చాయని , ముఖ్యంగా గతంలో కార్మికులకు సౌకర్యాలు అంతగా ఉండేవి కాదని కానీ ఇప్పుడు ఎన్నో సౌకర్యాలు కల్పిస్తున్నామని అన్నారు. ప్రమాదవశాత్తు ఎవరైనా కార్మికులు మరణించినట్లయితే రూ. 6 లక్షలు పూర్తిగా అంగవైకల్యం సంభవిస్తే రూ.5 లక్షలు , సహజ మరణం పొందినట్లయితే లక్ష రూపాయల వరకు ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందని తెలిపారు. కార్మికుని కూతురు వివాహ కానుకగా 30 వేల రూపాయలు , ప్రసూతి సహాయం కింద రూ. 30 వేలు , అనారోగ్య వైద్య చికిత్స నిమిత్తం రూ.9 వేలు , కార్మికులు మరణిస్తే దహన సంస్కారాల కోసం రూ. 30 వేలు , వృత్తి నైపుణ్య శిక్షణకు రూ.4500 అందజేయడం జరుగుతుందని మంత్రి వెల్లడించారు. కార్మికులు భయపడాల్సిన అవసరం లేదని , రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నదని , మహబూబ్‌నగర్‌ జిల్లా ఆసుపత్రిలో 201 లో 70 ప్రసవాలు ఉండగా , ఇప్పుడు 2300 వరకు పెరిగిందని తెలిపారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో న్యాక్‌తో పాటు , ఎల్‌ఆండ్‌టి , సెట్విన్‌ ద్వార నిరుద్యోగ యువతకు శిక్షణ ఇస్తామని అన్నారు. కార్మిక శాఖ ద్వార సహాయం కోసం ముందుగా నమోదు చేసుకొని ఉండాలని తెలిపారు. 78 వేల మంది కార్మికులు జిల్లాలో కార్మిక శాఖ వద్ద నమోదు చేసుకున్నట్లు తెలిపారు. ఎల్‌ఆండ్‌టి ద్వార ఎలక్ట్రికల్‌ శిక్షణను , న్యాక్‌ ద్వార మేస్త్రీ శిక్షణ , సెట్విన్‌ ద్వార మరో రకమైన శిక్షణను అందిస్తామని పేద ప్రజలు వీటిని వినియోగించుకోవాల్సిన ఆయన విజ్ఞప్తి చేశారు. జిల్లా కలెక్టర్‌ ఎస్‌. వెంకట్రావు మాట్లాడుతూ…కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్‌పిఆర్‌ వెంకటేశ్వర్లు , మాజీ కౌన్సిలర్‌ కృష్ణమోహన్‌ , డిప్యూటి కమిషనర్‌ ఆఫ్‌ లేబర్‌ చంద్రశేఖర్‌ , ఇతర అధికారులు , తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా న్యాక్‌ ద్వార 80 మంది కార్మికులకు మేస్త్రీ శిక్షణ సర్టిఫికేట్లు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా నూతనంగా ఎంపికైనా 17 మంది జూనియర్‌ పంచాయితీ కార్యదర్శులకు మంత్రి నియామక పత్రాలను అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement