Friday, April 19, 2024

ఎన్నాళ్లకెన్నాకో, రంగారెడ్డి జిల్లాకు దక్కిన రాజ్యసభ చాన్స్‌

ఉమ్మడిరంగారెడ్డి, ప్రభన్యూస్‌బ్యూరో : ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఏర్పాటై 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. కానీ, ఈ జిల్లానుండి రాజ్యసభకు వెళ్లింది మాత్రం తక్కువే. రాజకీయపరంగా చైతన్యం ఉన్న జిల్లాగా పేరున్న కీలక పదవులు మాత్రం ఆమడదూరంలో నిలుస్తున్నాయి. రాజ్యసభ కోసం ఎంతోమంది పోటీపడ్డా ఎవరికీ పదవి దక్కలేదు. తాజాగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌. కృష్ణయ్యకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి రాజ్యసభ సీటు పక్కా చేశారు. తెలంగాణ రాష్ట్రం నుండి సీటు దక్కకపోయినా పక్క రాష్ట్రం నుండి ఆయనకు సీటు దక్కింది. వికారాబాద్‌ జిల్లాకు మోమిన్‌పేటకు చెందిన ఆర్‌. కృష్ణయ్య ఎన్నో సంవత్సరాలుగా బీసీల సంక్షేమం కోసం పోరాటాలు చేస్తున్నారు. 2014 అసెంబ్లిd ఎన్నికల్లో రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఎల్బీనగర్‌ ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

అప్పట్లో ఆయన తెదేపా తరపున పోటీ చేసి విజయం సాధించారు. అప్పట్లో తెదేపా అధికాకరంలోకి వస్తే ఆయనను సీఎం చేస్తామని అప్పట్లో తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ప్రకటించిన విషయం తెలిసిందే. 2018లో జరిగిన ఎన్నికల్లో పొత్తుల్లో భాగంగా ఎల్బీనగర్‌ను తెదేపా కాంగ్రెస్‌కు వదిలిపెట్టింది. దీంతో ఆర్‌ కృష్ణయ్య పోటీ చేసే అవకాశం దక్కలేదు. తరువాత బీసీల సంక్షేమం కోసం జాతీయ స్థాయిలో పోరాటాలకు శ్రీకారం చుట్టారు. బలహీన వర్గాలకు చెందిన ఆయనకు రాజ్యసభ దక్కడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుండి తొలిసారి రాజ్యసభకు ఆర్‌. కృష్ణయ్య వెళ్తున్నారు. యాబై ఏళ్లలో తొలిసారి ఉమ్మడి జిల్లాకు ఆంధ్రప్రదేశ్‌ సీఎం పుణ్యమా అని సీటు దక్కింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement