Saturday, December 7, 2024

TG | సమగ్ర ఇంటింటి సర్వేను సక్సెస్ చేద్దాం.. మంత్రి పొన్నం

  • బలహీనవర్గాల అభ్యున్నతి కోసమే
  • రాజకీయాలకతీతంగా నిర్వహణ
  • రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్


వేములవాడ, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే కు ప్రతి తెలంగాణ పౌరుడు సహకరించి సక్సెస్ చేయాలని తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. ఇంటింటి సమగ్ర సర్వే బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నిర్వహిస్తున్నామన్నారు. ఇది ఎవరి సమాచారాన్ని ఇబ్బంది పెట్టేందుకు కాదన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక దిక్సూచి అవసరాల కోసం తీసుకుంటున్న సమాచారం మాత్రమే అని గుర్తు చేశారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాలకు ఏం చేశారో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. బీసీల గురించి మాట్లాడే అర్హత కేసీఆర్, కేటీఆర్ లకు లేదన్నారు. మీ పార్టీ అధ్యక్ష, కార్యనిర్వహక పదవి, ప్రతిపక్ష పదవి బీసీలకు, ఎస్సీలకు ఒక్కోటి ఇస్తే మీకు బీసీల గురించి మాట్లాడే అర్హత ఉంటుందన్నారు. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు అన్యాయం చేసిన మీకు బడుగు, బలహీన వర్గాల గురించి మాట్లాడే అర్హత ఎక్కడిదన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో జరుగుతున్న ఈ కుల సర్వే దేశ వ్యాప్తంగా జరగాలని డిమాండ్ వస్తుందన్నారు. కుల సర్వే ఇష్టం లేని బీజేపీ తెలంగాణలో బీసీలకు అన్యాయం చేయాలని చూస్తున్న బీఆర్ఎస్ కలిసి సర్వే పై అక్కడక్కడ అప్రతిష్టపాలు చేయాలని చూస్తున్నారన్నారు. జీవో నెంబర్ 18 ద్వారా యావత్ తెలంగాణలో సమాచారం సేకరించి అసమానతలు తొలగించి అన్ని రకాలుగా న్యాయం చేయాలనే ఆలోచనతో ముందుకు పోతున్నామన్నారు.

- Advertisement -

ఆప్షనల్ గా ఆధార్ కార్డు ప్రజల స్థితిగతులు తెలవడానికి మాత్రమే సర్వేలు అడుగుతున్నారని, బ్యాంకు వివరాలు అవసరం లేదని సూచించారు. ప్రభుత్వం కేవలం సమాచారం సేకరిస్తుందని, ఎలాంటి అనుమానాలకు తావు లేదన్నారు. సమాచార సేకరణకు వస్తున్న ఎన్యుమరేటెర్స్ కు సమాచారం ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం పక్షాన విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. రాజకీయ పార్టీల రెచ్చగొట్టే వ్యాఖ్యలకు ప్రభావితం కావద్దని విజ్ఞప్తి చేశారు.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన మీ ఆకాంక్షలకు అనుగుణంగా వచ్చిందన్నారు. భవిష్యత్ ప్రణాళికలతో ముందుకు పోతున్నామని, అందరం కలిసికట్టుగా తెలంగాణను అభివృద్ధి పరుచుకుందామని కోరారు. సమావేశంలో ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ తో పాటు మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్, కాంగ్రెస్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement