Friday, April 26, 2024

టెట్‌ దరఖాస్తుకు ఆఖరు రోజు.. ఊహించిన దానికంటే పెరిగిన దరఖాస్తులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: టెట్‌ పరీక్షకు అభ్యర్థుల నుంచి భారీ స్పందన వస్తోంది. గతంలో ఎన్నడూ లేనంతగా టెట్‌కు దరఖాస్తు చేసుకుంటున్నారు. పరీక్ష కేంద్రాల సామర్థ్యానికి మించి దరఖాస్తులు వస్తుండటంతో జిల్లాల్లోని పరీక్షా కేంద్రాలను అధికారులు బ్లాక్‌ చేస్తున్నారు. సోమవరం టెట్‌ ఫీజు చెల్లింపునకు చివరి రోజు కాగా, మంగళవారం టెట్‌ దరఖాస్తుకు చివరి గడువు ఉండడంతో సోమవారం అభ్యర్థులు భారీగా దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. దీంతో 33 జిల్లాల్లో 24 జిల్లాలను బ్లాక్‌ చేసినట్లు అభ్యర్థులు చెప్పారు. సోమవారం సాయంత్రం వరకు హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌, వికారాబాద్‌; వరంగల్‌, హన్మకొండ తదితర 27 జిల్లాలను బ్లాక్‌ చేశారని పేర్కొన్నారు.

మార్చి 26 నుంచి అప్లికేషన్ల ప్రక్రియ ప్రారంభంకాగా, ఇప్పటికే 4.5 లక్షల వరకు దరఖాస్తులు అందినట్లు సమాచారం. నేడు ఆఖరు తేదీ కావడంతో మరో 50వేల వరకు దరఖాస్తులు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ సారి ఎస్‌జీటీ పోస్టులకు బీఎడ్‌ అభ్యర్థులకూ అవకాశం ఇవ్వడంతో పేపర్‌-1కు భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. 2017 జులైలో నిర్వహించిన టెట్‌ పరీక్షకు ఈ విధంగా జిల్లాలను బ్లాక్‌ చేయలేదని చెప్తున్నారు. ఎడిట్‌ ఆప్షన్‌ ఇచ్చి మరో వారం పది రోజులైనా టెట్‌ గడువు పెంచాలని అభ్యర్థులు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement