Friday, April 19, 2024

దేశంలో 1,17,285 స్కూళ్ల‌లో ఒకే టీచ‌ర్..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: అటు రాష్ట్రంలో ఇటు దేశంలోనూ సర్కారు బడుల రూపురేఖలు ఎంతకూ మారడంలేదు. మౌలిక వసతుల నుంచి మొదలుపెడితే టీచర్ల వరకూ ఎప్పుడూ కొరతే!. ప్రభుత్వ పాఠశాలల స్థితిగతులు ఎంతకీ మారడంలేదు. ఉపాధ్యాయుల కొరతతో సర్కారు బడులు దేశంలో అల్లాడుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లు సరిపడా ఉండడం లేదు. దీంతో ఒకరి ద్దరితోనే పాఠశాలలు నడుస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఒకే టీచర్‌ (ఏకోపాధ్యాయ) పాఠశాలలు పెరు గుతున్నట్లు కేంద్ర ప్రభుత్వ గణాంకాల ద్వారా స్పష్టమవుతోంది. దేశంలో ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలలు 11.04 లక్షలు ఉంటే వాటిలో 1,17,285 బడుల్లో ఒకే ఒక్క టీచర్‌ మాత్రమే ఉన్నారు. విద్యార్థులకు చదువు చెప్పేది ఆయన ఒక్కరే. 2017లో ఒకే టీచర్‌ ఉన్న స్కూళ్లు 92 వేలు ఉండగా, 2021-22 విద్యా సంవత్సరం నాటికి 1.17 లక్షలకు చేరాయి. అంటే నాలుగేళ్లలో దాదాపు 25వేల స్కూళ్లు పెరిగాయి. రాష్ట్రంలో సాధారణ ప్రభుత్వ పాఠశాలలు, ఇతర రెసిడెన్షియల్‌ పాఠశాలలు, కేంద్ర ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలలు కలిపి 30,724 ఉండగా వాటిలో 6,393 పాఠశాలల్లో ఒక్కరే టీచర్‌ పనిచేస్తున్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో ఒక్క విద్యార్థి కూడా లేని బడులు దాదాపు 1200 వరకు ఉన్నాయి. విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా కనీసం ఇద్దరు టీచర్లను నియమించాలన్న డిమాండ్‌ ఎప్పటి నుంచో ఉన్నా విద్యాశాఖ పట్టించుకోవడంలేదనే విమర్శలున్నాయి. ఒక్క టీచరు ఉన్న స్కూళ్లు ఎక్కువగా ప్రాథమిక పాఠశాలలే ఉన్నాయి. ప్రాథమిక బడుల్లో ఐదు తరగతులకు రోజుకు దాదాపు 18 పిరియడ్ల (క్లాసులు)ను ఆ ఒక్క టీచరే తీసుకోవడం గమనార్హం. దీంతో అన్ని తరగతులకు ఒక్కరే బోధించాలంటే వారికి విద్యాబోధన తీవ్ర భారమవుతోంది. ఫలితంగా విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉంది. ఉపాధ్యాయులను నియమించకుండా తొలిమెట్టు లాంటి కార్యక్రమాలు ఎన్ని చేసినా అది వృథాయే అవుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి. తక్షణమే 10 వేల నుంచి 15 వేల టీచర్‌ పోస్టులను భర్తీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే టీచర్‌ పోస్టులను భర్తీ చేస్తామని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఇంత వరకూ ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వలేదు.

విద్యకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్‌ను కేటాయిస్తున్నా అందులో దాదాపు అత్యధికశాతం జీతభత్యాలకే పోతున్నాయి. మిగిలినవే ఏమైనా ఉంటే 10-20 శాతం ఇతర సదుపాయాలకు ఖర్చు చేస్తున్నారు. గత రెండేళ్ల కరోనా కాలంలో ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య పెరిగినా మౌలిక వసతులు మాత్రం మెరుగుపడడంలేదు. ”మన ఊరు మన బడి” పేరుతో ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపడుతున్నా పాఠశాలల రూపురేఖలు త్వరితగతిన మారడంలేదు. ఇప్పటికీ దాదాపు 80శాతం బడుల్లో కంప్యూటర్లు లేవు. ఇక విద్యార్థులకు డిజిటల్‌ విద్య ఎలా అందుతుందని విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైనా వసతులు, టీచర్లు లేకపోవడంతో గతంలో ప్రైవేట్‌ పాఠశాలల నుంచి ప్రభుత్వ బడులకు వచ్చిన విద్యార్థులు తిరిగి ప్రైవేటుకు వెళ్లిపోతున్నారు.

2021-22లో సర్కారు బడుల్లో 2.78 లక్షల అడ్మిషన్లు పెరిగినా వాటిలో మళ్లిd 1.80 లక్షల అడ్మిషన్లు తిరిగి ప్రైవేటు పాఠశాలలకే వెళ్లిపోయాయి. 2022-23 విద్యా సంవత్సరంలో 26 వేలకు పైగా బడుల్లో 23.78 లక్షల మంది విద్యార్థులున్నారు. గత ఆర్థిక సంవత్సరానికి పాఠశాల విద్యాశాఖకు కేటాయించిన నిధులు రూ.12,528 కోట్లుగా.. 2023-23 ఈ బడ్జెట్‌లో రూ.14,488 కోట్లు కేటాయించారు. అంటే ఒక్కో విద్యార్థిపై దాదాపు రూ.60 వేలకు పైగా ఖర్చు అవుతోంది. అదేవిధంగా రాష్ట్రంలో ప్రైవేట్‌ పాఠశాలలు 11,067 ఉన్నాయి. కొన్ని కార్పొరేట్‌ స్కూళ్లు మినహా అత్యధికంగా ఉన్న బడ్జెట్‌ స్కూళ్లలో ఒక్కో విద్యార్థి ఫీజు రూ.20 వేల నుంచి రూ.40 వేల మధ్యలోనే ఉంది. కొన్ని స్కూళ్లల్లో మాత్రం రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు ఉంది. అయితే తక్కువ ఫీజులు ఉండే ప్రైవేటు పాఠశాలలో విద్యా ప్రమాణాలు మెరుగ్గా ఉంటే ప్రభుత్వ విద్యార్థులపై ప్రభుత్వం భారీగా ఖర్చు చేస్తున్న ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రం నాసిరకంగా ఉంటున్నాయనే ఆరోపణలున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement