Thursday, April 25, 2024

సింగ‌రేణిని కాపాడుకుంటాం…ధ‌ర‌ణిని కొన‌సాగిస్తాంః విప‌క్షాల‌కు కెటిఆర్ కౌంట‌ర్

హైద‌రాబాద్ : సింగ‌రేణి కార్మికుల‌తో క‌ల‌సి ఉద్య‌మాలు చేసైనా ఆ సంస్థ ప్రైవేటుపరం కాకుండా కాపాడుకుంటామ‌ని తేల్చి చెప్పారు మంత్రి కెటిఆర్.. అలాగే ధ‌ర‌ణిని కొన‌సాగిస్తామ‌ని, చిన్న చిన్న లోపాలుంటే స‌రిచేస్తామ‌ని ప్ర‌క‌టించారు.. అంత‌కు ముందు సింగ‌రేణిపైనా, ధ‌ర‌ణిపైనా జ‌రిగిన చ‌ర్చ‌లో పాల్గొన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధ‌ర్ మాట్లాడుతూ, ధ‌ర‌ణి వ‌ల్ల రైతులు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటున్నార‌ని ఆరోపించారు.. ధ‌ర‌ణి లోని లోపాలను అడ్డుపెట్టుకుని కొన్ని జిల్లాల‌లో క‌లెక్ట‌ర్లు కోట్ల‌లో దండుకుంటున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు.. తాము అధికారంలోకి వ‌స్తే ధ‌ర‌ణిని ర‌ద్దు చేస్తామ‌ని చెప్పారు..

దీనికి స్పందించిన మంత్రి కెటిఆర్ కాంగ్రెస్ స‌భ్యుడు శ్రీధ‌ర్ చేసిన ఆరోప‌ణ‌ల‌ను ఖండించారు.. ధ‌ర‌ణిని ర‌ద్దు చేయ‌డం.. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌ను బ‌ద్ద‌లు కొట్టడం, బాంబుల‌తో పేల్చేయాల‌న‌డం కాంగ్రెస్ విధానామా? అని కేటీఆర్ కాంగ్రెస్ స‌భ్యుల‌ను సూటిగా ప్ర‌శ్నించారు. ధ‌ర‌ణి పోర్ట‌ల్‌తో రైతులు సంతోషంగా ఉన్నారని స్ప‌ష్టం చేశారు. గ‌త ఆరేండ్ల‌లో 30 ల‌క్ష‌ల డాక్యుమెంట్లు రిజిస్ట్రేష‌న్ అయితే ఈ ఏడాదిన్న‌ర కాలంలోనే 23 ల‌క్ష‌ల 92 వేల డాక్యుమెంట్లు రిజిస్ట్రేష‌న్ అయ్యాయ‌ని అన్నారు.. క‌ట్రెండు లోపాలు జ‌రిగితే రాష్ట్ర‌మంతా గంద‌ర‌గోళం నెల‌కొంద‌ని చెప్ప‌డం స‌రికాద‌న్నారు. కాంగ్రెస్ హ‌యాంలో లంచం లేకుండా రిజిస్ట్రేష‌న్లు, మ్యుటేష‌న్లు చేయ‌కుండా రైతుల‌ను రాక్ష‌సంగా ఇబ్బంది పెట్టిన‌ట్లే ఇప్పుడు కూడా ఇబ్బంది పెట్టాల‌ని చూస్తున్నాం అని శ్రీధ‌ర్ బాబు చెప్ప‌ద‌లుచుకున్నారా? అని కేటీఆర్ ప్ర‌శ్నించారు. ఆధారాలు లేకుండా నిందారోప‌ణ‌లు చేయ‌డం స‌రికాద‌ని అన్నారు.
ప్రైవేటు భాగ‌స్వామ్యంతోనైనా బ‌య్యారంలో స్టీట్ ప్లాంట్ – కెటిఆర్
సింగ‌రేణిపై మాట్లాడుతూ, సింగ‌రేణిని ప్ర‌యివేటుప‌రం చేయాల‌న్న కేంద్ర ప్ర‌భుత్వ కుట్ర‌ను భగ్నం చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. సింగ‌రేణి కార్మికుల‌ను, అన్ని రాజ‌కీయ ప‌క్షాల‌ను క‌లుపుకొని ఉద్య‌మానికి శ్రీకారం చుట్టి సింగ‌రేణిని కాపాడుకుంటామ‌ని మంత్రి పేర్కొన్నారు. సింగ‌రేణి బొగ్గు గ‌నుల విష‌యంలో ప్ర‌ధాని మోడీ, కేంద్ర మంత్రుల‌కు సీఎం కేసీఆర్ లేఖ రాశార‌న్నారు. నాలుగు బొగ్గు గ‌నులు త‌మ‌కే ఇవ్వాల‌ని లేఖ‌లో పేర్కొన్నార‌ని వివ‌రించారు.. కానీ నాలుగు బొగ్గు గ‌నుల‌ను వేలం వేస్తున్నాం.. అందులో పాల్గొన‌చ్చ‌ని కేంద్రం చెప్పింద‌ని కేటీఆర్ తెలిపారు. సింగ‌రేణిని కార్మికులంద‌రికీ మాటిస్తున్నామ‌ని ,కార్మికుల‌ను, అన్ని రాజ‌కీయ ప‌క్షాల‌ను క‌లుపుకొని సింగ‌రేణి ప‌రిర‌క్ష‌ణ‌కు ఉద్య‌మానికి శ్రీకారం చుడుతామ‌ని చెప్పారు.. బ‌య్యారం విష‌యంలో కేంద్రం నిస్సిగ్గుగా మాట త‌ప్పింద‌న్నారు. బ‌య్యారంలో స్టీల్ నిక్షేపాలు లేవ‌ని కేంద్ర మంత్రి అవాస్త‌వాలు ప్ర‌చారం చేస్తున్నార‌న్నారు.. స్టీల్ ఫ్యాక్ట‌రీ ఏర్పాటుకు ప్ర‌త్యామ్నాయం ప్రారంభించామ‌న్నారు.వ‌ర‌ల్డ్ ఎకాన‌మిక్ ఫోరంలో కూడా జిందాల్, మిట్ట‌ల్ వారితో ప్రాథ‌మికంగా సంప్ర‌దింపులు జ‌రిపామ‌ని తెలిపారు.. కేంద్రం ముందుకు రాక‌పోతే ప్ర‌యివేటు రంగం ద్వారా,లేదా సింగ‌రేణి ద్వారానైనా బ‌య్యారం స్టీల్ ఫ్యాక్ట‌రీ ఏర్పాటు చేస్తాం అని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement