Tuesday, December 10, 2024

KTR | ప్రభుత్వ వైఫల్యాలపై వారోత్సవాలు నిర్వహిస్తాం: కేటీఆర్‌

ఆంధ్రప్రభ, హనుమకొండ: ఏం చేశారని కాంగ్రెస్‌ పార్టీ విజయోత్సవాలు చేస్తుందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రశ్నించారు. తాము కూడా కాంగ్రెస్‌ పరిపాలన వైఫల్య వారోత్సవాలను నిర్వహిస్తామని అన్నారు. హనుమకొండ జిల్లా బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడుతూ.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డికి బాంబుల శాఖ ఇవ్వాలని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్ర వెళ్లి అబద్ధాలు, హౌలా మాటలు మాట్లాడుతున్నారని కేటీఆర్‌ అన్నారు. ఎవని అయ్యా సొమ్ము అని అబద్ధాలతో ఫుల్ పేజీ యాడ్లు వేస్తున్నాడని విమర్శించారు. సరిగ్గా సంవత్సరం కింద ఇదే రోజు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ పార్టీ బీసీలకు అనేక హామీలు ఇచ్చిందని తెలిపారు. ఆడపిల్లల ఓట్ల కోసం బలహీన వర్గాల ఓట్ల కోసం దొంగ హామీలను ఇచ్చారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క బీసీ డిక్లరేషన్ హామీ అయినా అమలు చేసిందా అని నిలదీశారు. కొత్త పథకాల విషయం దేవుడెరుగు.. ఉన్న వాటిని కూడా కాంగ్రెస్ ఎత్తేసిందని తెలిపారు.

వెనుకబడిన వర్గాలకు కాంగ్రెస్‌ వెన్నుపోటు

కాంగ్రెస్‌ ప్రభుత్వం వెనకబడిన వర్గాలకు వెన్నుపోటు పొడిచిందని కేటీఆర్‌ అన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో చేతి వృత్తులకు చేయూతనిస్తూ బలహీన వర్గాలకు విద్య, వృత్తి లాంటి అన్ని అవకాశాల్లో ఆసరాగా నిలిచిందని అన్నారు. పథకాలన్నింటికీ పాతర వేసిన పాపాత్ములు కాంగ్రెస్ నాయకులు అని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం దళిత బంధు తర్వాత బీసీల కోసం బీసీ బంధు ప్రవేశపెట్టింది.. కానీ రేవంత్ రెడ్డి రాగానే బీసీ బంధు, రైతుబంధు, దళిత బంధు ఇలా అన్ని బంద్ అయినయని అన్నారు. కులగణన కచ్చితంగా చేయాల్సిందేనని డిమాండ్‌ చేశారు. కులగణన పూర్తయిన తర్వాతనే, 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలని డిమాండ్‌ చేశారు. ప్రధాన ప్రతిపక్షంగా బహుజన వర్గాల తరఫున ప్రభుత్వం ముందు ఉంచుతున్నామని అన్నారు.

ఒక్క బీసీ బిడ్డకు అయినా రుణం ఇచ్చారా

ఆరు నెలల్లో స్థానిక సంస్థల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పి ఏడాది దాటిన అమలు చేయలేదని కేటీఆర్‌ అన్నారు. 42శాతం రిజర్వేషన్లు అమలు అయినంకనే ఎన్నికలు పెట్టాలని ఇంటికి వచ్చే ప్రభుత్వాధికారులను, కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను ప్రజలు నిలదీయాలని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ప్రజలకు ఉందని తెలిపారు. సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం, ప్రభుత్వాధికారులపై ఉన్నదని అన్నారు. రేవంత్ రెడ్డి బీసీల కోసం ఇచ్చిన హామీలపైన, ఇచ్చిన ఆరు గ్యారెంటీ అమలు పైన ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని కోరారు. బీఆర్‌ఎస్‌ పార్టీ బృందం తమిళనాడులో పర్యటించి అక్కడ బీసీలకు అమలువుతున్న రిజర్వేషన్లను అధ్యయనం చేసిందని కేటీఆర్‌ తెలిపారు. చిత్తశుద్ధి ఉంటే తమిళనాడు మాదిరి తెలంగాణలో కూడా చేయవచ్చు అని పార్టీ బృందం చెప్పిందని పేర్కొన్నారు. మూడు లక్షల రూపాయల ఆదాయమున్న ప్రతి బీసీ కుటుంబానికి పూర్తి ఫీజు రీయంబర్స్‌మెంట్‌ ఎక్కడ పోయిందని ప్రశ్నించారు. ప్రతి మండలంలో ఒక గురుకులం అన్నారు. ఎక్కడికి పోయిందని నిలదీశారు. ప్రతి జిల్లా కేంద్రంలో బీసీ గురుకుల డిగ్రీ కాలేజ్ అన్నారని.. బీసీలకు 10 లక్షల వడ్డీ లేని రుణమిస్తా అని చెప్పారని.. ఒక్క బీసీ బిడ్డకు అయినా రుణం ఇచ్చారా అని ప్రశ్నించారు.

- Advertisement -

రేవంత్ రెడ్డి బీసీలకు క్షమాపణ చెప్పాలి

ఐదేళ్లలో బీసీల సంక్షేమ కోసం సంవత్సరానికి 20 వేల కోట్ల చొప్పున ఐదు సంవత్సరాలలో లక్ష కోట్లు ఖర్చుపెడతామని చెప్పారని అన్నారు. కేవలం 8 వేల కోట్ల రూపాయలు మాత్రమే బడ్జెట్‌లో కేటాయించారని.. అందులో ఎంత ఖర్చు పెడతారో ఎవరికీ తెలియదని చెప్పారు. బీసీల కోసం లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం ప్రారంభించనందుకు రేవంత్ రెడ్డి బీసీలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ కాంట్రాక్టులో 42 శాతం బీసీలకు ఇస్తామని చెప్పి మాట తప్పినందుకు రేవంత్ రెడ్డి బీసీలకు క్షమాపణ చెప్పాలన్నారు.

కొత్త మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తా అంటే ఎవరు నమ్ముతారు

సర్పంచ్ లకు పెండింగ్ లో ఉన్న బకాయిలు వెంటనే చెల్లించాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. బీసీ వెల్ఫేర్ శాఖతోపాటు ఎంబీసీలకు మరొక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తానని అన్నారని తెలిపారు. ఉన్న మంత్రులనే నింపుకోలేని అసమర్థుడు రేవంత్ రెడ్డి… కొత్త మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తా అంటే ఎవరు నమ్ముతారని ప్రశ్నించారు. రాష్ట్రానికి అవసరం ఉన్న 18 మందిని నింపుకోలేని చేతకానివాడు రేవంత్ రెడ్డి అని వ్యాఖ్యానించారు. అన్ని జిల్లా కేంద్రాల్లో 50 కోట్లతో బీసీ కన్వెన్షన్ హాల్ ఏర్పాటు చేస్తానని అన్నారని, ఒక్కదానికైనా కనీసం పని మొదలైందా అని ప్రశ్నించారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ పేరిట బీసీ ఐక్యత భవనాలు ఏర్పాటు చేస్తామన్నారని.. అది ఏమైందని నిలదీశారు. చేతివృత్తుల వారికి 50 ఏళ్లకే పెన్షన్లు ఇచ్చి.. అందరికీ 4000 ఇస్తా అన్నావ్… కొత్త పెన్షన్లు వదిలేసి ఉన్న పెన్షన్లు కూడా సరిగా ఇస్తలేరు. వాళ్లందరికీ క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ తరఫున డిమాండ్‌ చేశారు. ముదిరాజ్‌లను బీసీ-డీ నుంచి బీసీ-ఏ కి మారుస్తానన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. 100 రోజుల్లో గొల్ల కురుమలకు రెండో విడత గొర్రెల పంపిణీ అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని అన్నారు. ముదిరాజులకు, గొల్ల కురుమలకు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. గౌడన్నలకు 5 ఎకరాలు భూమి ఈత వనాల కోసం ఇస్తామన్నారు.. ఏమైందన్నారు. పద్మశాలీలకు మెగా పవర్ లూమ్ ఇస్తా అన్నావ్.. నేతన్నలను ఆత్మహత్యల పాలు చేస్తున్నవని మండిపడ్డారు.

బీసీ డిక్ల‌రేష‌న్‌తో వెన్నుపోటు..

బీసీ డిక్లరేషన్ పేరిట బలహీన వర్గాలకు బలమైన వెన్నుపోటు పొడిచింది కాంగ్రెస్ ప్రభుత్వం అని కేటీఆర్‌ అన్నారు. బీసీలకు సబ్ ప్లాన్ ఇస్తామని చెప్పినవ్. ఇప్పటి దాకా ఆ అంశం ఏమైందని ప్రశ్నించారు. బీసీలను మోసం చేసేందుకు మాత్రమే బీసీ డిక్లరేషన్ వాడుకున్న రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని బీసీలకు క్షమాపణ చెప్పాలని అన్నారు. దళిత బంధు నిధులు ఇవ్వాలని అడిగితే మా ఎమ్మెల్యేల పైన దాడులు చేస్తున్నారని అన్నారు. ఇచ్చిన హామీ ప్రకారం బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఆర్థిక భరోసా కార్యక్రమం వెంటనే ప్రారంభించాలని తెలిపారు.

డిక్లరేషన్లన్నీ పాములై రేవంత్ మెడలో పడతాయి

ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ అడ్డగోలుగా మాట్లాడుతున్నారని కేటీఆర్ అన్నారు. ధాన్యానికి రూ. 500 బోనస్ ఇస్తానని చెప్పి మాట తప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అబద్దాల ముఖ్యమంత్రిని తెలంగాణ రాష్ట్ర సమితి తరపున అడుగుతూనే ఉంటామని.. నిలదీస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన డిక్లరేషన్లన్నింటిపైనా ప్రశ్నిస్తూనే ఉంటామని తెలిపారు. డిక్లరేషన్లన్నీ పాములై రేవంత్ మెడలో పడతాయని పేర్కొన్నారు. అన్ని డిక్లరేషన్లు అమలయ్యేదాకా రేవంత్ ను వదిలిపెట్టమని హెచ్చరించారు. మేము చేసిన పనులు మీరు చేసినట్టు చెప్పుకుంటే ప్రజలు కాంగ్రెస్ నాయకుల బట్టలు ఊడదీసి కొడతారని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై కూడా మేము వైఫల్యాల వారోత్సవాలను నిర్వహిస్తామని స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement