Thursday, April 25, 2024

క్షుద్ర పూజలతో శవాన్ని మళ్లీ బతికిస్తా.. జగిత్యాలలో మూఢనమ్మకం

శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం వేగంగా అభివృద్ధి చెందున్నా…ప్రజలు మాత్రం ఇంకా మూఢనమ్మకాలను నమ్ముతున్నారు. చనిపోయిన వ్యక్తిని తిరిగి బతికిస్తానంటు వ్యక్తి చెప్పిన మాటలను మృతుని కుటుంబ సభ్యులు నమ్మడమే ఇందుకు నిదర్శనం. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది.

పోలీసుల కథనం ప్రకారం…జగిత్యాల జిల్లా కేంద్రంలోని తారకరామా నగర్ కు చెందిన ఒర్సు రమేష్, అనిత భార్య భర్తలు. కూలిపని చేసుకుంటూ బతుకుతున్నారు. వీరి ఇంటి సమీపంలో కొమ్మరాజు పుల్లేశ్, సుభద్ర దంపతులు నివాసం ఉంటున్నారు. ఇటీవల రమేష్ తీవ్ర అనారోగ్యానికి గురికాగా.. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. అయితే, పుల్లేశ్, సుభద్ర చేతబడి చేయడంతోనే రమేష్ చనిపోయాడని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఆ దంపతులను చెట్టుకు కట్టేసి కొట్టారు. దెబ్బలు భరించలేక… తానే చేతబడి చేసి రమేష్ ను చంపానని… క్షుద్ర పూజ చేసి మళ్లీ బతికిస్తాననినని పుల్లేశ్ వారిని నమ్మించాడు. దాంతో మృతుడి కుటుంబ సభ్యులు పూజా సామాగ్రి తీసుకొచ్చారు. అయితే, సమాచారం అందుకున్న పోలీసులు.. శవం వద్ద పూజలు చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు.

ఈ క్రమంలో రమేష్ సగం ప్రాణంతో ఉన్నాడని, అతని మృతదేహాన్ని తరలించవద్దని మృతుడి కుటుంబ సభ్యులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి శవాన్ని తరలించి పరీక్షించారు. రమేష్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే, పుల్లేశ్ మంత్రం వేస్తే రమేష్ బతికి వస్తాడంటూ కుటుంబ సబ్యులు, బంధువులు కరీంనగర్–జగిత్యాల రహదారిపై ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న జగిత్యాల డిఎస్పీ వెంకట రమణ అక్కడికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడి మృతదేహాన్ని ఇంటికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement