Saturday, April 20, 2024

కిలాడీ దొంగ‌.. ముఖం క‌నిపించ‌కుండా మాస్క్

గ‌చ్చిబౌలిలో టెలీకాల‌ర్ గా ప‌నిచేస్తున్నాడు రాజేష్ యాద‌వ్. మధ్యతరగతి కుటుంబానికి చెందిన అతడు ఆర్థిక కష్టాలను చూస్తూనే పెరిగాడు. ఇక మద్యానికి కూడా బానిసైన అతడు జల్సాలకు అలవాటుపడ్డాడు. కాల్ సెంటర్ లో జాబ్ ద్వారా వచ్చే సాలరీ అతడి జల్సాలకు సరిపోకపోవడంతో అప్పులపాలయ్యాడు. దీంతో ఈజీగా మనీ సంపాదించడం కోసం దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నాడు. నిత్యం సికింద్రాబాద్ నుండి గచ్చిబౌలికి వెళ్లే క్రమంలో సంపన్నులు నివాసముండే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ మీదుగా వెళ్లేవాడు రాజేష్. ఆ ప్రాంతంలోని ఖరీదైన ఇళ్లను, విలాసవంతంగా బ్రతికే మనుషులను చూసేవాడు. దీంతో దొంగతనానికి ఈ ప్రాంతమే సరైందిగా నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే జూబ్లీహిల్స్ లోని ఓ ఇంట్లో దొంగతనం చేయాలని నిర్ణయించుకుని పలుమార్లు రెక్కీ నిర్వహించాడు. ఈ నెల 12న తన రాబరీ ప్లాన్ ను అమలుచేసాడు.
తెల్లవారుజామునే జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 52లో వున్న వ్యాపారి రాజు ఇంటికి చేరుకున్నాడు రాజేష్.

ముఖానికి మాస్క్, చేతికి గ్లౌజ్ లు, చేతిలో కత్తి పట్టుకుని ఇంట్లోకి ప్రవేశించిన అతడు ఎనిమిది నెలల గర్భిణి మెడపై కత్తి పెట్టి కుటుంబసభ్యులందరినీ బెదిరించాడు. అందరినీ ఓ గదిలో బంధించి డబ్బులు డిమాండ్ చేసాడు. దీంతో వారు ఇంట్లోని కొంత డబ్బుతో పాటు బయటినుండి మరికొంత తెప్పించి అతడికి ఇచ్చారు. ఇలా కుటుంబాన్ని బెదిరించి పదిలక్షల రూపాయలతో పరారయ్యాడు.పక్కా ప్లాన్ తో రాజేష్ దొంగతనానికి పాల్పడటంతో పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. సిసి కెమెరాకు చిక్కకుండా, ఫింగర్ ప్రింట్స్ దొరక్కుండా జాగ్రత్తపడ్డ రాజేష్ చేసిన చిన్న తప్పే పోలీసులకు ఆధారంగా మారింది.పారిపోడానికి బుక్ చేసుకున్న క్యాబ్ ఆధారంగానే పోలీసులు నిందితున్ని పట్టుకున్నారు. క్యాబ్ డ్రైవర్ సికింద్రాబాద్ లో నిందితుడిని వదిలినట్లు తెలపడంతో అతడు అదే ప్రాంతానికి చెందినవాడై వుంటాడని పోలీసులు అనుమానించగా అదే నిజమయ్యింది. దొంగతనానికి పాల్పడింది రాజేష్ అని గుర్తించిన పోలీసులు దోచుకున్న సొమ్ముతో హైదరాబాద్ శివారులో పార్టీ చేసుకుంటున్న అతడిని పట్టుకున్నారు. నిందితుడి నుండి దొంగిలించిన నగదుతో పాటు కత్తిని స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement