Saturday, April 20, 2024

తెలంగాణ య‌వ‌నికపై మ‌రో కొత్త పార్టీ – సంక‌ల్ప స‌భ‌కు బ‌య‌లుదేరిన ష‌ర్మిల‌..

హైదరాబాద్ / ఖ‌మ్మం – తెలంగాణ య‌వ‌నిక‌పై మ‌రో కొత్త పార్టీ ఏర్పాటు కానుంది.. దివంగ‌త నేత వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి త‌న‌య వైస్ ఎస్ ష‌ర్మిల ఈ పార్టీకి నేడు శ్రీకారం చుట్ట‌నున్నారు… కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా ముందుకెళ్తున్న వైయస్‌ షర్మిల మొదటిసారి నేడు తెలంగాణ‌ ప్రజాక్షేత్రంలోకి అడుగుపెడుతున్నారు..కొత్త పార్టీ పరిచ‌ల వేదిక‌గా ఆమె ఖ‌మ్మం ను చేసుకున్నారు.. సంక‌ల్ప స‌భ పేరుతో ఇక్క‌డ భారీ స‌భ నేటి సాయంత్రం జ‌ర‌గనుంది.. ఈ స‌భ‌లో పాల్గొనేందుకు హైద‌రాబాద్ లోట‌స్ పాండ్ నుంచి భారీ కాన్వాయ్ తో ఆమె ఖమ్మంకు ప్ర‌యాణం ప్రారంభించారు.. ఈ స‌భ‌కు బ‌య‌లుదేరేముందు ఆమె భ‌ర్త అనిల్ ఆశీస్స‌లు తీసుకున్నారు.. త‌న భార్య కొత్త ప్ర‌యాణం విజ‌య‌వంతం కావాల‌ని కోరుతూ అనిల్ భార్య ష‌ర్మిల‌తో క‌ల‌సి దిగిన ఫోటోను ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేశారు..కాగా, దాదాపు 9ఏండ్ల తరువాత షర్మిల సంకల్ప సభతో ఖమ్మం వేదికగా ప్రజల ముందుకు రానుండడంతో ఆమె ఏంచేప్తారనే దానిపై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వైయస్‌ మరణానంతరం 2013లో ఓదార్పుయాత్ర చేసిన షర్మిల అనంతర పరిణామాల్లో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కోసం కృషి చేశారు. అనంతరం రాజకీయంగా స్తబ్దుగా ఉన్న ఆమె..2021 ఫిబ్రవరి 9న ఆత్మీయ సమ్మేళనాల పేరుతో తెలంగాణలోని అన్ని జిల్లాల నేతలు, అభిమానులతో సమావేశాలు నిర్వహించారు. తెలంగాణలో ఏర్పడిన పరిస్థితులు, ప్రజలు అనుకున్న విధంగా పాలన లేదని, మళ్లి రాష్ట్రంలో రాజన్న సంక్షేమ పాలన రావాల్సిన అవసరం ఉందని అందుకే సమ్మేళనాలను ఏర్పాటుచేసినట్టు పలు సమావేశాల్లో ఆమె తెలిపారు. కాగా రాష్ట్రంలో కొత్త రాజకీయ పార్టీ వస్తుందని ఆ పార్టీ రావడంతోనే తెలంగాణ ప్రజలకు సుపరిపాలన అందిస్తామని కూడా ఆమె పలు ఆత్మీయ సమ్మేళనాల్లో చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఫిబ్రవరి 9నుంచి మొదలైన ఆత్మీయ సమ్మేళనాలు ఖమ్మం మినహా అన్ని జిల్లాలు పూర్తి చేసుకోవడంతో..ఖమ్మం సభతో ఆమె ప్రజల్లోకి వస్తున్నారు. కాగా నేడు షర్మిల నిర్వహించబొయే సంకల్ప సభకు తన తల్లి వైయస్‌ విజయలక్ష్మి ముఖ్య అతిధిగా హజరవనున్నారు.
సంకల్ప సభతో పాటు అసలు షర్మిల రాష్ట్రంలో కొత్త రాజకీయ పార్టీ నెలకొల్పాల్సిన అసవరం ఏంటి, ఎందుకు అనే అంశాలతో పాటు రాజకీయంగా ఎదురవుతున్న పలు ప్రశ్నలకు ఆమె సభ వేదికగా సమాధానమిస్తారని ఆమె అనుచరులు చెబుతున్నారు. ఇదిలా ఉంచితే ప్రధానంగా ముఖ్య అతిధిగా హాజరవుతున్న విజయమ్మ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి గౌరవాధ్యక్షురాలిగా ఉండగా, ఈ సభకు ఎలా హాజరవుతారంటూ పలు ప్రశ్నలు ఉత్పన్నమవుతుండగా, ఆమె తల్లి హోదాలో బిడ్డను ఆశీర్వదించేందుకు వస్తున్నారని షర్మిల అనుచరులు చెబుతున్నారు. సభ సందర్భంగా షర్మిలకు మద్ధతుగా పలువురు నేతలు పార్టీలోకి చేరనున్నారని తెలుస్తున్నప్పటికీ ఈ రోజే చేరుతారా లేక జులై 8న పార్టీ ప్రకటన రోజు పార్టీలోకి చేరుతారా అన్నది తెలియాల్సి ఉంది.
పార్టీ, జెండా, విధివిధానాలు..జూలై 8నే..
షర్మిల ఏర్పాటుచేయనున్న పార్టీకి సంబంధించి పార్టీ పేరుగా వైయస్సార్‌ తెలంగాణ పార్టీ అని ప్రచారం జరుగుతున్నప్పటికీ, పార్టీకి సంబంధించిన పేరు, జెండా, విధివిధానాలను మాత్రం నేటి సభలో ఆమె ప్రకటించరని తెలుస్తోంది. మాజీ ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి జన్మదినం సందర్భంగా జూలై 8న పార్టీ, జెండా, విధివిధానాలను ఖరారు చేస్తారని లోటస్‌పాండ వర్గాల ద్వారా తెలుస్తోంది. మరి జూలై 8నే సభ ఏర్పాటు చేయకుండా ఇపుడు ఎందుకు ఏర్పాటుచేస్తున్నారని వస్తున్న ప్రశ్నలకు సమాధానం చెబుతూ..అన్ని జిల్లాల ఆత్మీయ సమ్మేళనాలను లోటస్‌పాండ్‌ వేదికగా నిర్వహించామని, ఇందులో భాగంగానే ఖమ్మం సమ్మేళనాన్ని ప్రజల మధ్యన నిర్వహించాలన్న కారణంతోనే సభను ఏర్పాటుచేస్తున్నామని షర్మిల అనుచరవర్గం చెబుతోంది.
అపోహలకు, సందేహాలకు సభతో స్వస్తి..
వైయస్‌ షర్మిల ఏర్పాటుచేయబోయే కొత్త పార్టీపై తెలంగాణలోని రాజకీయ పార్టీలు పలు రకాలుగా స్పందించడంతో పాటు పార్టీ ఏర్పాటుపై చాలా మంది అపో హలు, సందేహాలతో ఉన్నారని.. అలాంటి వారి అపోహలు, సందేహాలకు నేటి సభతో షర్మిల స్వస్తి చెప్పనున్నారని కూడా తెలు స్తోంది. ఇప్పటికే ఆంధ్రా ప్రాంత వాసుల పార్టీ తెలంగాణలో అవసరంలే దన్న వ్యాఖ్యలకు కూడా ఆమె గట్టిగానే సమాధా నం చెప్తారని అనుచరగణం చెబు తోంది. దీంతో పాటు ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ అంశంపై కూడా క్లారిటీనివ్వనున్నారు.
అధికార పార్టీపై ఆగ్రహం..
రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో సఫలీకృతమైందా, యువతకు ఉద్యోగ అవకాశాలు, రైతుల ఆత్మహత్యలు, మహిళలకు ప్రాధాన్యత విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న వైఖరిపై ఆమె మాట్లాడనున్నట్టు తెలుస్తోంది. దీంతో పాటు తెలంగాణలో రాజన్న సంక్షేమ పాలన ఎందుకు రావాల్సి ఉందన్న అంశంపై ప్రజల మధ్యనే వివరంగా తెలుపుతారని..రాష్ట్రం కోసం షర్మిల తీసుకున్న సంకల్పం ఏంటనే విషయాలను కూలంకషంగా సభ ద్వారా ప్రజలకు తెలుపుతారని లోటస్‌పాండ్‌ వర్గాలు చెబుతున్నాయి. ఏదేమైనా..దాదాపు 9ఏండ్ల తరువాత ప్రజా క్షేత్రంలోకి వస్తున్న షర్మిలను తెలంగాణ ప్రజలు ఏ విధంగా స్వీకరిస్తారనేది వేచిచూడాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement