Thursday, April 25, 2024

అర్హులైన పేదలంద‌రికీ ఇళ్ల‌ పట్టాలు : మంత్రి పువ్వాడ

ఖమ్మం : రాష్ట్ర ప్రభుత్వం పేదలకు మేలు చేసేందుకు తీసుకొచ్చిన జీవో నెంబ‌ర్ 58&59 పథకం కింద ఖమ్మం నగరంలో అర్హులైన వారికి 18వ డివిజన్ రామకృష్ణ నగర్ లో ఆయా పట్టాలను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఖమ్మం నగరంలోని 16, 18, 19 & 21, 22, 23వ డివిజన్ పేదలకు జీవో 58,59 పట్టాలను మంత్రి పువ్వాడ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఖమ్మంలోనే మొదటిగా జీవో నెంబ‌ర్ 58, 59 పథకం కింద పెద్ద ఎత్తున పట్టాలు సిద్ధం చేసి పంపిణీ చేస్తున్నామని అన్నారు. మునుపెన్నడూ లేని విధంగా తెరాస ప్రభుత్వంలో పేదలు ప్రభుత్వ స్థలాల్లో తాత్కాలికంగా ఎర్పాటు చేసుకున్న నివాసాలకు వారికే ఈ పథకం ద్వారా శాశ్వత ఇళ్ల‌ పట్టాలు పంపిణీ చేస్తున్నామని అన్నారు. పేదలకు పూర్తి స్థాయిలో న్యాయం జరగాలనే ఉద్దేశంలో మొన్న జరిగిన క్యాబినెట్ లో మంత్రులం అందరూ కలిసి జీవో నెంబ‌ర్ 58, 59 పథకాన్ని పొడిగించాలని విజ్ఞప్తి చేయగా ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా స్పందించి గడువును పొడిగించారని పేర్కొన్నారు. ఇంకా దరఖాస్తు చేసుకోని వారు మళ్లీ ద‌రఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఆయా పట్టాలు అందిస్తామని మంత్రి పువ్వాడ స్పష్టం చేశారు. ఖమ్మం నగరంలోనే నిర్మించిన 2 వేల మందికి డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించి పేదలకు అందజేశామని అన్నారు. ఇళ్లు రాని వారికి సొంత స్థలం ఉన్న వారికి రూ.3 లక్షలు ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం తరుపున ఇస్తామని అన్నారు.

పేదవాళ్ళ పట్ల ప్రభుత్వం ఎంతో చిత్తుశుద్ధితో వ్యవహరిస్తున్నది BRS ప్రభుత్వమే అని అన్నారు. ఖమ్మం నగరంలో ఒకానొక రోజు త్రాగునీటి కొరత ఉండేదని, తెలంగాణ ప్రభుత్వం వచ్చాకే పకడ్బందీ ప్రణాళికతో ప్రతి ఇంటికి మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికి స్వచ్చమైన తాగునీరు అందిస్తున్నామని గుర్తు చేశారు. ఎన్నికలు వస్తుండటంతో ఖమ్మంలో కొందరు నాయకులు బయలుదేరారని వారికి ఎలాంటి అజెండా లేకుండా కేవలం స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే మాట్లాడుతున్నారని, కల్లబొల్లి మాటలు చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ మైక్ పట్టుకుంటే కల్లబొల్లి మాటలు చెబుతున్నారు అని అంటున్నారు కొందరు కల్లబొల్లి మాటలు చెబితే నేడు మనకు 24గంటల కరెంట్, రైతులకు ఉచితంగా 24గంటల కరెంట్ వచ్చి ఉండేదా.. రైతు బంధు, రైతు భీమా వచ్చేదా.. పెన్షన్ లు, కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ ఇలా అనేక పథకాలు వచ్చేవా అని ప్రశ్నించారు. కేసీఆర్ ని గద్దె దింపుతా అని కొందరు పిచ్చికూతలు కూయడం హాస్యాస్పదంగా ఉందని, అసలు నువ్వు ఎంటీ.? నీ స్థాయి ఏంటో చెప్పాలన్నారు. రానున్న ఎన్నికల్లో సీఎం కేసీఆర్ గారు మళ్ళీ గెలుస్తారని, హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని, సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఖమ్మం జిల్లా సస్యశ్యామలం అవుతుందన్నారు.

తెలంగాణ ప్రభుత్వంలో పేదలు ఇబ్బందులు పడుతున్నారని అంటున్న ఆ నాయకుడికి ఒక సవాల్ విసిరారు మంత్రి పువ్వాడ.. ఇక్కడే టేకులపల్లిలో పేదలు నివాసం ఉంటున్న KCR టవర్ లోనే చర్చ పెడదాం.. దమ్ముంటే రా.. ఖమ్మం అభివృద్ధిపై నేను బహిరంగ చర్చకు సిద్దం.. నువ్వు సిద్దమా అని సవాల్ విసిరారు. ఖమ్మంలో ఓ మహానుభావుడు అంటున్నాడు.. సీతారామ ప్రాజెక్ట్ పై మాట్లాడుతూ గోదావరి నీళ్లతో రైతుల కాళ్ళు ఎప్పుడు కడుగుతారు అని..? సమయం వస్తుందని వచ్చినపుడు తప్పకుండా అందరి కాళ్ళు కడుగుతామని స్పష్టం చేశారు. కానీ ఆ ఉద్రుతికి మీరు నిలబడగలరా…? చూసి తట్టుకోగలరా..? ఆ ఉదృతిలో మీరందరూ కొట్టుకొనిపోవడం ఖాయమన్నారు. పేదలందరు సంతోషంగా ఉన్నారని మీ కళ్ళకు ఎందుకు కనబడటం లేదో నాకైతే అర్దం కాట్లేదన్నారు. ప్రభుత్వం చేస్తున్న అనేక అభివృద్ధి పనులను ఒక్కొక్కటిగా చూసుకుని ఎంత అద్భుతంగా అమలు అవుతున్నాయో చూసి ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కంటి వెలుగు కార్యక్రమం అద్భుతంగా కొనసాగుతున్నాయని, బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూడాలంటే మీరు తప్పకుండా కంటి వెలుగులో పరీక్షలు చేసుకుని, మా ప్రభుత్వం అందిస్తున్న ఉచిత కళ్ళ అద్దాలు పెట్టుకొని చూడాలని కోరారు. ఖమ్మం ప్రజలందరికీ పూర్తి స్థాయిలో న్యాయం జరిగేదాకా ఖమ్మంను విడేది లేదన్నారు. ఎవరికి, ఎప్పుడు, ఎలా బుద్ది చెప్పాలో ప్రజలకు బాగా తెలుసునని వారే మీకు సమాధానం చెబుతారని పేర్కొన్నారు. మేయర్ పునుకొల్లు నీరజ, కలెక్టర్ వీపీ గౌతమ్, కార్పొరేటర్లు కర్నాటి కృష్ణా, మందడపు లక్ష్మీ మనోహర్, పల్లా రోజ్ లీనా, ఆళ్ళ నిరిషాఅంజిరెడ్డి, ఎస్ కే మక్బూల్, మేడారపు వెంకటేశ్వర్లు, చామకూరి వెంకన్న, తహసిల్దార్ శైలజ, నాయకులు RJC కృష్ణా తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement