Wednesday, April 17, 2024

పీవీకి భారతరత్న ఇవ్వాలి : మంత్రి పువ్వాడ

ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి దేశాన్ని అభివృద్ధిలోకి తీసుకొచ్చిన దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారత రత్న ఇవ్వాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. పీవీ జయంతి సందర్భంగా ఖమ్మం నగరంలోని లకారం సర్కిల్‌లో గల పీవీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు ఆర్పించారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. బహుముఖ ప్రజ్ఞశాలి, సంస్కరణశీలి పీవీని కేంద్రం విస్మరించడం బాధాకరమన్నారు. పీవీ ముందు చూపుతో తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలతో దేశం ఆర్థికంగా బలోపేతమైందన్నారు. కేంద్రం పట్టించుకోకపోయినా తెలంగాణ ప్రభుత్వం ఆయన శతజయంతి సందర్భంగా ఏడాది పొడవునా వేడుకలు నిర్వహించిందని గుర్తు చేశారు. ప్రధానిగా పీవీ ప్రవేశపెట్టిన సంస్కరణలతో దేశం ఆర్థికంగానే కాకుండా, అణుశక్తి, విదేశాంగ విధానం, అంతర్గత భద్రత వంటి రంగాల్లో గుణాత్మక అభివృద్ధి సాధించిందని అన్నారు. సకల జనుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యాచరణ దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. తెలంగాణ నాయకత్వ దార్శనికత దేశానికి దిక్సూచిగా నిలుస్తుందనే విషయాన్ని పీవీ నిరూపించారని తెలిపారు. తెలంగాణ బిడ్డగా పీవీ అందించిన స్ఫూర్తితో ముందుకు సాగుతామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement