Thursday, April 25, 2024

28 కేసుల్లో ఎనిమిది మంది అరెస్ట్.. రూ.40 లక్షల విలువైన సొత్తు రికవరీ

ఖమ్మం : కొంతమంది వ్యక్తులు ముస్తఫానగర్ నివాస ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లుగా అందిన విశ్వసనీయ సమాచారం మేరకు ఈరోజు ఉదయం సుమారు 9 గంటలకు ఖమ్మం వన్ టౌన్, సీసీఎస్ పోలీసులు ఎనిమిది మందిని అదుపులోకి తీసుకొని విచారించినట్లు పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్‌.వారియర్ తెలిపారు. ఈరోజు పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నిందితులతో పాటు వారి వద్ద స్వాధీనం చేసుకున్న ఆభరణాలు, నగదు వివరాలను పోలీస్ కమిషనర్ వెల్లడించారు. నిందితులు సూర్యపేట జిల్లా కాగిత రామచంద్రపురం గ్రామానికి చెందిన 1) నూకమళ్ళ నాగేంద్రబాబు, (2) పప్పుల రాజ్ కుమార్ ( పండు), అదే గ్రామానికి చెందిన స్నేహితులు (3) బాదే నాగేంద్రబాబు, (4) మండల అశోక్, (5) బాణాల ముత్యాలు, (6) చింతమల్ల వెంకన్న, (7) కులకులపల్లి మహేశ్ తో పాటు ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం మల్లేపల్లి గ్రామానికి చెందిన (8) తెలగమల్ల వెంకటేశ్వర్లు (రవి) అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. జల్సాలకు అలవాటు పడిన నిందితులు ఎలాగైనా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో నేర ప్రవృత్తి ఎంచుకొని పలుచోట్ల దొంగతనాలకు పాల్పడినట్లు పేర్కొన్నారు. దొంగతనం చేసిన బంగారాన్ని కొన్న జ్ఞానేశ్వరి బంగారం దుకాణం గాందీచౌక్, ఖమ్మం కు చెందిన ఎలబోయిన కృష్ణ కూడా నిందితుడు. ఖమ్మం నగరంలో (27) సూర్యపేట జిల్లాలో (01) మొత్తం 28 ఇళ్ళలో బంగారం, వెండి ఆభరణాలు ఇతర వస్తువులు దొంగతనం చేసినట్లు పోలీసుల విచారణలో నిందుతులు వెల్లడించారని పోలీస్ కమిషనర్ తెలిపారు. దొంగలించిన డబ్బుతో A1, A2 నిందితులు నూకమళ్ళ నాగేంద్రబాబు, పప్పుల రాజ్ కుమార్ (పండు) అనే వ్యక్తులు గోవా, విశాఖపట్నం ప్రాంతాలలో తిరుగుతూ.. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారని తెలిపారు. A1 నిందితుడు నూకమళ్ళ నాగేంద్రబాబు వృత్తి రీత్యా డ్రైవర్ కావడంతో ఖమ్మంలో ప్రముఖ వైద్యుడు వద్ద గత కొంతకాలం పనిచేస్తూ.. తన సమీప బందువు అయిన పప్పుల రాజ్ కుమార్ (పండు)తో కలసి ఖమ్మం నగరంలోని ముస్తఫానగర్ లో ఓ ఇల్లు అద్దెకు తీసుకొని నివాసం ఉంటున్నారు. ఇటీవల డాక్టర్ వద్ద డ్రైవర్ ఉద్యోగం వదిలేసి బయట యాక్టింగ్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో తన స్నేహితులైన ఏడుగురుతో కలసి అప్పుడప్పుడు తన నివాసంలో మద్యం సేవించడం.. జల్సా అవసరాల కోసం నేర ప్రవృత్తి ఎంచుకొని చోరీలకు పాల్పడుతున్నారని తెలిపారు. గత రెండేళ్ళలో ఖమ్మం వన్ టౌన్ (15) ఖమ్మం ఖానాపురం హావేలి (10) ఖమ్మం టూ టౌన్ (02) సూర్యపేట జిల్లా అనంతగిరి పోలీసు స్టేషన్ పరిధిలో (01) మొత్తం 28 ఇళ్ళలో చోరీ చేశారని తెలిపారు. దోచుకున్న చోరీ సొత్తును విక్రయించగా వచ్చిన సొమ్ముతో విలాసవంతమైన జీవితాన్ని గడిపేవారని తెలిపారు.

స్వాధీనం చేసుకున్న చోరీ సొత్తు
నిందుతుల నుంచి 638 గ్రాముల బంగారు నగలు, 2 కేజీల వెండి, 10 ఎల్.ఇ.డి. టివీలు, 03 గ్యాస్ సిలెండర్లు, బంగారు, వెండి విలువ సుమారు రూ.40 లక్షల వరకు ఉంటుందన్నారు. బంగారం వెండి నగలను రికవరీ చేసినట్లు తెలిపారు. పోలీస్ కమిషనర్ విష్ణు య‌స్ వారియర్ ఆదేశాల మేరకు నిందుతులను పట్టుకొని, చోరీ సోత్తు స్వాధీనం చేసుకున్న ఏసీపీ సీసీఎస్ టి.రవి, ఏసీపీ ఖ‌మ్మం టౌన్ ఆంజనేయులు, సీసీఎస్ సీఐఎస్ మల్లయ్య స్వామి, పీ.నవీన్, వన్ టౌన్ సిఐ చిట్టిబాబు, ఎస్ఐలు,పోలీస్ సిబ్బందిని పోలీస్ కమిషనర్ అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement