Wednesday, April 24, 2024

ట్యాంక్ బండ్ ప‌రిస‌రాల‌ని ప‌రిశుభ్రంగా ఉంచండి.. మంత్రి కేటీఆర్

ప్ర‌పంచ ప‌ర్యాట‌కులని ఆక‌ర్షించేందుకు హైద‌రాబాద్ లోని ప‌ర్యాట‌క ప్రాంతాల‌ను సుంద‌రీక‌రిస్తున్నారు. అందులో భాగంగా మ‌హాన‌గ‌రానికి మ‌ణిహారంగా మారిన ట్యాంక్‌బండ్‌ను అద్భుతంగా తీర్చిదిద్దారు. దీంతో సాయంత్రం వేళ‌, సెల‌వు దినాల్లో ట్యాంక్ బండ్‌కు ప‌ర్యాట‌కులు పోటెత్తుతున్నారు. అయితే ట్యాంక్‌బండ్‌ను ప‌ర్యాట‌కులు అపరిశుభ్రంగా త‌యారు చేస్తున్నారు. రాత్రి వేళల్లో తినుబండారాల‌కు సంబంధిన ప‌దార్థాల‌ను, కేకుల‌ను ఇత‌ర‌త్రా వ్య‌ర్థాల‌ను ట్యాంక్‌బండ్‌పై ప‌డేస్తున్నారు. దీంతో ఆ ప్రాంత‌మంతా అప‌రిశుభ్రంగా మారడ‌మే కాకుండా, మార్నింగ్ వేళ వ‌చ్చే ప్ర‌కృతి ప్రేమికుల‌కు, వాక‌ర్స్‌కు కాస్త ఇబ్బందిని క‌లిగిస్తోంది.ఈ విష‌యం ప్ర‌భుత్వ యంత్రాంగం దృష్టికి రావ‌డంతో.. రాష్ట్ర ప‌ట్ట‌ణాభివృద్ధి, మున్సిపాలిటీ శాఖ‌ల మంత్రి కేటీఆర్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో ఓ వీడియోను విడుద‌ల చేస్తూ.. మెసేజ్ ఇచ్చారు. మహానగరానికి మణిహారం ట్యాంక్‌బండ్.. శతాబ్దాల ఘన చరిత్రకు ప్రతీక ట్యాంక్‌బండ్! అందుకు తగ్గట్టే… ట్యాంక్‌బండ్ సుందరీకరణను ప్రతిష్టాత్మకంగా తీసుకొని, ఈ విశిష్ట నిర్మాణానికి మరిన్ని మెరుగులు అద్ది… ట్యాంక్‌బండ్‌ను అత్యంత అందంగా తీర్చిదిద్దింది తెలంగాణ ప్రభుత్వం అని కేటీఆర్ తెలిపారు. నగర ప్రజలకు, పర్యాటకులకు ఆహ్లాదాన్ని, ఆనందాన్ని అందిస్తూ, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచుతున్న ట్యాంక్‌బండ్ పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చూడటం మనందరి బాధ్యత అని సూచించారు. మనం నివసించే ఇంటిలాగానే మనకు గర్వకారణం అయిన పర్యాటక ప్రదేశాల్లో కూడా పరిశుభ్రతను పాటించాలని ప్రజలందరికి విజ్ఞప్తి చేస్తున్నాను అని కేటీఆర్ త‌న ట్విట్ట‌ర్‌లో తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement