Thursday, April 18, 2024

రైతుల శ్రేయస్సుకు కేసీఆర్ ప్రభుత్వం ఎనలేని కృషి : ఎమ్మెల్యే వివేకానంద్…

రైతుల శ్రేయ‌స్సు కోసం కేసీఆర్ ప్ర‌భుత్వం ఎన‌లేని కృషి చేస్తుంద‌ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గౌడ్ అన్నారు. ఆయ‌న మాట్లాడుతూ… రాజకీయ లబ్ధిపొందాలనే దురుద్దేశంతో రైతు బీమాపై బీజేపీ నేతలు చేస్తున్న అసత్య ఆరోపణలు చేస్తున్నార‌న్నారు. ప్రపంచానికి అన్నం పెట్టే రైతన్నకు ఎలాంటి కష్టం రాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యవసాయ రంగంలో దేశంలో మరెక్కడా లేని విధంగా పలు సంస్కరణలు అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. రైతన్న అకాల మరణం చెందితే ఆ కుటుంబం ఇబ్బందులు పడకుండా ఆసరాగా నిలిచేందుకు రాష్ట్రవ్యాప్తంగా రైతు బీమా పథకాన్ని సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని చెప్పారు. గతంలో ఏ ప్రభుత్వాలు చేయని విధంగా తమ ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుంటే ఓర్వలేక బీజేపీ నేతలు కుట్రలకు తెరలేపుతున్నారని మండిపడ్డారు. దేశంలో ఏ రాష్ట్రంలో రైతులకు చేయని మేలు సీఎం కేసీఆర్ నాయకత్వంలో జరుగుతుంటే మతతత్వ పార్టీ జీర్ణించుకోలేకపోతుందని ఘాటుగా విమర్శించారు.

రైతు బంధు ఆపేస్తారు.. రైతులకు నిజంగా రైతు భీమా ఇవ్వడం లేదు అంటూ టీఆర్ఎస్ ప్రభుత్వంపై అజ్ఞానుల్లా బీజేపీ నేతలు చేసే ఆరోపణలను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ తీవ్రంగా ఖండించారు. వాస్తవాలు తెలుసుకోకుండా విమర్శలు చేయడం వారి అజ్ఞానానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బీమా, రైతు బంధు వంటి పథకాలపై ప్రతిపక్షాలు ముందు లోతుగా అధ్యయనం చేసి మాట్లాడాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 102 నియోజకవర్గాల్లో ప్రభుత్వం రైతు బీమా పథకం ఎంత మందికి ఇస్తుందో వివరాలను ఎమ్మెల్యే తెలిపారు. 2018 – 2019లో 17,641 మంది మరణించిన రైతు కుటుంబాలకు రూ.882.05 కోట్లు, 2019 – 2020లో 18,912 మంది మరణించిన రైతు కుటుంబాలకు రూ.945.6 కోట్లు, 2020 – 2021లో 27,701 మంది మరణించిన రైతు కుటుంబాలకు రూ.1385.05 కోట్లు, 2021 – 2022లో 3,766 మంది మరణించిన రైతు కుటుంబాలకు రూ.188.3 కోట్లు, మొత్తం 68,020 కుటుంబాలకు రూ.3,401.00 కోట్ల రైతు భీమా ఇచ్చిన ఏకైక పార్టీ టీఆర్ఎస్ అని ఎమ్మెల్యే కేపి వివేకానంద్ స్పష్టం చేశారు.


తన నియోజకవర్గమైన కుత్బుల్లాపూర్ పరిధిలోని 33 మంది మరణించిన రైతు కుటుంబాలకు రూ.1.65 (కోటి అరవై ఐదు లక్షలు) రైతు భీమా ప్రభుత్వం ఇచ్చిందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అనుక్షణం రాష్ట్ర ప్రగతి కోసం, ప్రజా సంక్షేమం కోసం పరితపిస్తూ ప్రవేశపెడుతున్న పథకాలపై విపక్షాలు ఇప్పటికైనా కళ్ళు తెరచుకొని విమర్శలు, అబద్ధపు ప్రచారాలు మానుకోవాలని ఎమ్మెల్యే కేపి వివేకానంద్ హితవు పలికారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement