Friday, April 26, 2024

ఆ వార్త‌లో నిజం లేదు – ఎమ్మెల్సీ క‌విత‌

హైద‌రాబాద్ – ఢిల్లీ లిక్కర్ స్కాం​ కేసులో విచార‌ణ‌ను ముందుగానే ప్రారంభించాల‌ని కోరుతూ ఎమ్మెల్సీ క‌విత సుప్రీం కోర్టులో వేసిన పిటిష‌న్ పై ఆమెకు చుక్కెదురైందంటూ కొన్ని ప‌త్రిక‌ల‌లోనూ, ఛాన‌ల్స్ లోనూ, సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్న వార్త‌ను క‌విత ఖండించారు.. సుప్రీంకోర్టులో తన పిటిషన్ పై త్వరగా విచారణ చేపట్టాలని కోరలేదని, అలాగే ఎటువంటి పిటిష‌న్ వేయ‌లేద‌ని అన్నారు. ఈ మేర‌కు ఆమె త‌న అధికారిక ట్విట్ట‌ర్ ఖాతాలో ట్విట్ చేశారు. సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్న పిటిషనే మార్చి 24న విచారణకు వస్తుందని చెప్పారు. ఈ నెల 11న ఈడీ విచారణకు క‌విత‌ హాజరయ్యారు. నిన్న రెండోసారి విచారణ జరగాల్సి ఉండగా అందుకు హాజరుకాలేదు. ఈడీ విచారణ అనంతరం కవితను అరెస్ట్ చేస్తారన్న ఊహాగానాలు కూడా వచ్చాయి. సుప్రీంకోర్టులో ఈ నెల 24 జరగనున్న విచారణ గురించే కవిత ఎదురుచూస్తున్నారు. అప్పటి వరకు ఈడీ విచారణకు హాజరుకానని చెప్పారు. అయితే, ఈనెల 20న మరోసారి విచారణకు రావాలని కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఆమె విచారణకు వెళ్తారా? అన్న సందిగ్ధత నెలకొంది. దీనిపై క‌విత త‌న నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించ‌వ‌ల‌సి ఉంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement