Friday, April 19, 2024

ప్రగతి భవన్‌ ముట్టడికి కస్తూర్బా టీచర్ల యత్నం.. అడ్డుకున్న పోలీసులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ప్రగతి భవన్‌ ముట్టడికి యత్నించిన కస్తూర్బా పాఠశాల టీచర్లు, బీసీ సంఘాల నేతలను పోలీసులు అడ్డుకున్నారు. సోమవారం హైదరాబాద్‌లోని విద్యానగర్‌ వద్ద బీసీ భవన్‌ నుంచి ప్రగతి భవన్‌ ముట్టడికి కస్తూర్భా పాఠశాల టీచర్లు, బీసీ సంఘాల నేతలు బయలుదేరుతుండగా పోలీసు అడ్డుకుని ఆపివేశారు. దీంతో బీసీ భవన్‌ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు, బీసీ సంఘాల నేతల మధ్య కాసేపు వాగ్వివాదం జరిగింది. ఈ సందర్భంగా ఆందోళనలో పాల్గొన్న బీసీ జాతీయ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌. కృష్ణయ్య మాట్లాడుతూ.. విధుల నుంచి తొలగించిన 937 మంది కస్తూర్బా పాఠశాల టీచర్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

కెజిబివి పాఠశాల్లో 2021 నవంబర్‌లో కాంట్రాక్టు పద్దతిన 620 మంది పీజీ టీచర్లు, 317 స్కూల్‌ టీచర్లు, 42 పీఈటీలను హఠాత్తుగా తొలగించారని ఆయన ఆరోపించారు. టీచర్లను విధులకు హాజరుకావద్దంటూ అధికారులు మౌఖికంగా ఆదేశాలు జారీ చేయడం అన్యాయమన్నారు. టీచర్లను విధుల నుంచి తొలగిస్తే విద్యార్థులకు రివిజన్‌ పాఠాలు ఎవరు చెబుతారని ఆయన ప్రశ్నించారు. కనీసం ప్రైవేటు పాఠశాల్లో కూడా టీచర్లను తొలగించడం లేదన్నారు. ప్రభుత్వ పాఠశాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ , మైనారిటీ వర్గాలకు చెందిన విద్యార్థులే ఎక్కువగా చదువుతారన్నారు. ఈ వర్గాల విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలని తప్పా, నిర్లక్ష్యం చేయడం తగదన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement