Thursday, April 25, 2024

అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయం… సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల

ధర్మారం : అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పాలన సాగిస్తోందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. ఈరోజు ధర్మారం మండలం కొత్తూరు గ్రామంలో పర్యటించిన మంత్రి ఈశ్వర్‌ పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లలా భావించి ముందుకు సాగుతున్నారన్నారు. గ్రామాల్లో అభివృద్ధి పనులతోపాటు ప్రజా సమస్యల పరిష్కారం, మౌళిక సదుపాయాల కల్పనకు పెద్ద పీట వేస్తూ నిధులు మంజూరు చేయిస్తున్నారన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ముందుకు సాగుతూ అభివృద్ధి పనులను విజయవంతం చేయాలన్నారు.

అలాగే మల్లాపూర్‌ గ్రామంలో పర్యటించిన మంత్రి రైతు శిక్షణ కేంద్రంలో నిర్వహిస్తున్న కుట్టు శిక్షణ కేంద్రాన్ని సందర్శించారు. ఈసందర్భంగా మహిళలు శిక్షణతో మెళకువలు నేర్చుకొని స్వయం ఉపాధి రంగాలలో రాణించాలని పిలుపునిచ్చారు. కాగా, కొత్తూరు గ్రామంలో బోయపల్లి నుంచి నిమ్మపల్లి మధ్య రోడ్డు నిర్మాణం, కల్వర్టు నిర్మించాలని గ్రామస్తులు మంత్రికి విజ్ఞప్తి చేశారు. అలాగే కటికెనపల్లి గ్రామంలో ఇటీవల మరణించిన బోనగిరి నారాయణ కుటుంబాన్ని మంత్రి పరామర్శించారు. అనంతరం మండల కేంద్రంలోని బస్టాండ్‌ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్‌ చైర్మన్‌లు ముత్యాల బలరాంరెడ్డి, నోముల వెంకట్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ బుచ్చిరెడ్డి, తెరాస మండల అధ్యక్షుడు రాచూరి శ్రీధర్‌, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, రైతులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement