Tuesday, March 26, 2024

ఢిల్లీ పాలకులు ఎంత విషం చిమ్మినా.. తెలంగాణలో అభివృద్ధి ఆగదు.. మంత్రి గంగుల

ఢిల్లీ పాలకులు ఎంత విషం చిమ్మినా తెలంగాణలో అభివృద్ధి ఆగదని, అభివృద్ధి నిరంతర ప్రక్రియ అని బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. ఆదివారం కరీంనగర్ పట్టణంలో రాంనగర్, టవర్ సర్కిల్ ప్రాంతాల్లో పలు అభివృద్ధి పనులకు భూమిపూజ చేసి.. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీ, ఆంధ్ర పాలకులు ఇబ్బందులకు గురిచేసినా మా లక్ష్యం అభివృద్ధి అన్నారు. తెలంగాణ ప్రజలు కట్టిన పన్నులతో గుజరాత్ లో అభివృద్ధి చేయడం సిగ్గుచేటన్నారు. దేశ ప్రధాని హోదాలో మోడీ ప్రభుత్వాలను కూల దోస్తామనడం ప్రజలు గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చెబుతారన్నారు. మోడీది పూర్తిగా రాజకీయ యాత్ర అని, మునుగోడు ఓటమిని కప్పిపుచ్చేందుకు రాష్ట్రంలో ప్రధాని పర్యటించారన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కరీంనగర్ అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని వెల్లడించారు. గతంలో రోడ్లపై వంగిపోయిన తుప్పు పట్టిన పోల్స్, రోడ్లమీద ట్రాన్స్ ఫార్మర్లు దర్శనమిచ్చేవని, తాము విశాలమైన రోడ్లు, అందమైన కూడళ్లతో నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దామని పేర్కొన్నారు.


జనాభా పెరుగుతుంది కానీ రోడ్లు పెరుగవని, వేసిన రోడ్లను నిరంతరం పర్యవేక్షిస్తూ, రోడ్లు ఆక్రమించకుండా ప్రజలకు అసౌకర్యాలు కలగకుండా చూస్తున్నామన్నారు. రోడ్లను పరిశుభ్రంగా ఉంచేందుకు ఆటోమేటిక్ స్వీపింగ్ మిషన్లను కొనుగోలు చేశామన్నారు. పెండింగ్ లో ఉన్న రోడ్లను త్వరలో పూర్తి చేస్తామన్నారు. 50 సంవత్సరాల్లో జరగని అభివృద్ధిని 9 ఏళ్లలో చేసి చూపించామన్నారు.. కరీంనగర్ ను టూరిజం స్పాట్ గా తీర్చిదిద్దుతామన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పరిపాలన అందిస్తున్నామన్నారు. తెలంగాణ అభివృద్ధి చూసి ఓర్వలేక పాదయాత్రలు, కోతి చేష్టలతో తెలంగాణ సమాజాన్ని అయోమయానికి గురిచేస్తున్నారన్నారు. తెలంగాణలో ఆంధ్ర పాలన మళ్లీ అవసరమా అని పరోక్షంగా షర్మిల, కేఏ పాల్ ను ఉద్దేశించి వ్యంగాస్త్రాలు చేశారు. తెలంగాణ సంపదను దోచుకునే ప్రయత్నం ఢిల్లీ, ఆంధ్ర పాలకులు చేస్తున్నారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement