Thursday, March 30, 2023

అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి..

పెద్దపల్లిరూరల్‌: గ్రామాల్లో అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసేలా చొరవ తీసుకోవాలని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక మండల పరిషత్‌ సమావేశ మందిరంలో ఎంపీపీ బండారి స్రవంతి శ్రీనివాస్‌ గౌడ్‌ అధ్యక్షతన నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. కూరగాయల సాగు ఎంతో లాభదాయకమని వివరించారు. పాడి, పశుపోషణంపై దృష్టి సారించాలని రైతులకు పిలుపునిచ్చారు. గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను సత్వరమే పూర్తి చేయాలని స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులను ఆదేశించారు. మౌళిక సౌకర్యాల పెంపుకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందని, ఇందులో భాగంగానే గ్రామాల వారీగా పెద్ద ఎత్తున నిధులను కేటాయించినట్లు తెలిపారు. అవకాశాలను సద్వినియోగం చేసుకుని నిధుల వినియోగంతో గ్రామాల అభివృద్ధిలో పాలుపంచుకోవాలని సర్పంచ్‌, ఎంపీటీసీలకు సూచించారు. ప్రతి గ్రామంలో వైకుంఠదామం, పల్లె ప్రకృతి వనం, సెగ్రిగేషన్‌ షెడ్ల నిర్మాణాలు చేపట్టామన్నారు. వ్యవసాయ క్లస్టర్ల పరిధిలో రైతు వేదికలను నిర్మించి రైతులకు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. రైతు వేదికల ద్వారా ఆధునిక వ్యవసాయ సాగుకు, పంటల సాగులో యాజమాన్య పద్ధతులు, సస్య రక్షణ చర్యలను తెలుసుకునేందుకు ఉపయోగపడతాయన్నారు. ప్రస్తుత వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా మిషన్‌ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లా నీరు సరఫరా ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానిదేనని కితాబునిచ్చారు. ఈసందర్భంగా వివిధ శాఖల పనితీరుపై ఎమ్మెల్యే దాసరి సమీక్షించారు. ఈసమావేశంలో జడ్పీటీసీ బండారి రామ్మూర్తి, సింగిల్‌ విండో చైర్మన్‌ మాదిరెడ్డి నర్సింహరెడ్డి, ఎంపీఓ సుదర్శన్‌, ఎంపీటీసీలు, సర్పంచ్లు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement