Friday, March 29, 2024

వరద తెచ్చిన బురద… సిరిసిల్లకు మరో కష్టం!

భారీ వర్షాలు, వరదలతో జలదిగ్బంధంలో చిక్కుకున్న సిరిసిల్లలో సహాయక చర్యలు ముమ్మరం చేశారు. పట్టణంలోని చాలా ప్రాంతాల్లో వరద తగ్గుముఖం పట్టింది. నీరు లేనప్పటికీ వరద తెచ్చిన బురదతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎడతెరిపిలేని వర్షాలు రాజన్న సిరిసిల్ల జిల్లాను అతాలకుతలం చేశాయి. భారీ వర్షాలకు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం నీటి మునిగింది. కుండపోతగా కురిసిన వర్షాలతో సిరిసిల్ల పట్టణం జలమయమైంది. వరద నీరు చాలా కాలనీలను ముంచెత్తింది. చెరువులు నిండి.. వాగులు పొంగడంతో పట్టణంలోని పలు కాలనీలు జలదిగ్బంధమయ్యాయి. ఇళ్లలోకి వరద నీరు చేరింది. రంగంలోకి దిగిన ఎన్డీఆర్​ఎఫ్​ బృందాలు సహాయకచర్యలు చేపట్టాయి. ఇప్పుడిప్పుడే వరద నీరు తీసేస్తుండడంతో నగరం తేరుకుంటోంది. బుధవారం నాటికి వెంకంపేట, పాత బస్టాండ్, అంబిక నగర్ తదితర ప్రాంతాల్లో రోడ్లన్నీ ధ్వంసమయ్యాయి.

సిరిసిల్ల పట్టణంలోని శాంతినగర్ మినహా మిగిలిన ప్రాంతాల్లో వరద తగ్గింది. అయితే, రోడ్లన్నీ బురదగా మారాయి. కాలనీలు, ప్రధాన కూడళ్ల వద్ద చెత్త కుప్పలుతెప్పలుగా పేరుకుపోయింది. పలు చోట్ల రహదారులు కొట్టుకుపోయాయి. రోడ్లపై ఇసుక మేటలతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. సిరిసిల్లలో 216 కుటుంబాలను ఎన్డీఆర్​ఎఫ్​ బృందాలు పునరావాస కేంద్రానికి తరలించాయి. సిరిసిల్ల-కరీంనగర్ ప్రధాన రహదారిపై వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. వరద వల్ల ఈ మార్గంలో రవాణాకు అంతరాయం ఏర్పడింది. జిల్లావ్యాప్తంగా చెరువులు, కుంటలు అలుగుపారుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement