Thursday, April 25, 2024

సర్కారు బడికి వెళ్లాలంటే.. సర్కస్‌ ఫీట్లే..!

  • జమమయమైన పాఠశాల ఆవరణ
  • భారీ వర్షానికి చెరువును తలపించిన వైనం

ధర్మారం : భారీ వర్షానికి ప్రభుత్వ పాఠశాల ముందు నీరు చేరి చెరువును తలపిస్తోంది.. ఈ సర్కారు బడికి వెళ్లాలంటే విద్యార్థులు సర్కస్‌ ఫీట్ల చేయక తప్పని పరిస్థితి నెలకొంది. పాఠశాల లోపలికి వెళ్లే గేటు ముందే భారీగా వర్షపు నీరు చేరి కుంటగా మారడంతో విద్యార్థులు తరగతి గదులలోకి చేరుకునేందుకు ఇక్కట్లు తప్పడం లేదు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం జిల్లా పరిషత్‌ పాఠశాలలో వర్షపు నీటితో ఆవరణంతా నిండిపోయింది. వర్షాకాలం మొదలైన నాటి నుంచి ఈ పాఠశాలలో ఇదే దృశ్యం ఆవిష్కృతమవుతుంది.

పాఠశాల ముందు రోడ్డు మరమ్మతులో భాగంగా ఎత్తును పెంచడంతో వర్షపు నీరంతా పాఠశాలలోకి చేరుకొని జలమయమవుతోంది. నియోజకవర్గాల పునర్విభజనకు ముందు నియోజకవర్గ కేంద్రంగా ఉన్న మేడారం ఉన్నత పాఠశాల ఒక వెలుగు వెలిగింది. ఎందరో మేధావులను రాష్ట్రానికి అందించిన పాఠశాల ప్రస్తుతం సరైన వసతులు లేక విద్యార్థులు ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. రోడ్డు వేసిన కాంట్రాక్టర్‌ వర్షపు నీరు బయటకు వెళ్లేలా పైప్‌లైన్లను ఏర్పాటు చేయక పోవడంతో విద్యార్థుల అవస్థలు వర్ణణాతీతం. పాఠశాల యాజమాన్య కమిటీ, ఉపాధ్యాయులు సైతం పాఠశాల మైదానాన్ని ఎత్తు పెంచేలా చర్యలు చేపట్టక పోవడం విద్యార్థులకు శాపంగా మారింది. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతోపాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉండడంతో విద్యార్థులు మరింత ఇబ్బందులు పడనున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి విద్యార్థుల ఇబ్బందులు దూరం చేసేందుకు చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement