Friday, April 19, 2024

ప్రతి పౌరుడు సామాజిక బాధ్యతతో మెదలాలి : సీపీ సుబ్బారాయుడు

క‌రీంన‌గ‌ర్ : ప్రతి పౌరుడు సామాజిక బాధ్యతతో మెదలాలని కరీంనగర్ పోలీస్ కమీషనర్ సుబ్బారాయుడు అన్నారు. మద్యం సేవించి వాహనాలు నడుపడం వల్ల జరిగే ప్రమాదాలతో ఎన్నో కుటుంబాలు నష్టపోతాయన్న విషయాన్ని గుర్తించాలని చెప్పారు. వేసవి తీవ్రత నుండి ట్రాఫిక్ పోలీసులకు ఉపశమనం కలిగించేందుకు కరీంనగర్ పాల డైరీ యాజమాన్యం ఉచితంగా మజ్జిగ అందజేసే కార్యక్రమాన్ని సీపీ సుబ్బారాయుడు శుక్రవారం నాడు డైరీ ఛైర్మెన్ చలిమెడ రాజేశ్వరరావుతో కలిసి ప్రారంభించారు. ట్రాఫిక్ నియంత్రణకు దోహదపడే 50 స్టాపర్లను డైరీ యాజమాన్య అందజేసింది. ఈ కార్యక్రమం కమీషనరేట్ కేంద్రంలోని ఓపెన్ థియేటర్ ఆవరణలో జరిగింది. ఈ సందర్భంగా సీపీ సుబ్బారాయుడు మాట్లాడుతూ.. వాహనదారులు రోడ్డు నియమ నిబంధనలను పాటిస్తూ వాహనాలను నడుపాలన్నారు. ట్రాఫికకు అంతరాయం కలుగకుండా వాహనాలను పార్కింగ్ చేయాలని చెప్పారు. రోడ్డు నియమ నిబంధనలు పాటించకపోవడం వల్లనే ప్రమాదాలు జరుతున్నాయని తెలిపారు. ట్రాఫిక్ పోలీసులకు ఉచితంగా మజ్జిగను అందజేయడంతోపాటు ట్రాఫిక్ నియంత్రణకు దోహదపడే స్టాపర్లను అందజేసిన కరీంనగర్ డైరీ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు.

పోలీసుశాఖ చేపడుతున్న కార్యక్రమాలకు తమవంతు సహకారం అందజేయడంతోపాటు 1500 గ్రామాల్లోని ప్రజలకు పాడి పరిశ్రమ ద్వారా ఉపాధి అవకాశాలను కల్పించడం అభినందనీయమన్నారు. వాహనదారులు ధృవపత్రాలను వెంట ఉంచుకోవాలని సూచించారు. మైనర్లకు వాహనాలిచ్చే వాహనాల యజమానులతోపాటు తల్లిదండ్రులపై కేసులను నమోదు చేస్తామని హెచ్చరించారు. కరీంనగర్ డైరీ ఛైర్మెన్ చలిమెడ రాజేశ్వరరావు మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణ విధులతోపాటు ట్రాఫిక్ నియంత్రణ కోసం ఎండనకావాననకా శ్రమిస్తున్న పోలీసులకు తమవంతు సహకారం అందజేస్తామన్నారు. భవిష్యత్ లో చేపట్టే కార్యక్రమాలకు సైతం తమ సహకారం కొనసాగుతుందని చెప్పారు. డిసిపి (పరిపాలన) జి చంద్రమోహన్ మాట్లాడుతూ గూడ్స్ ట్రాలీల వాహనదారులు,డ్రైవర్లు ట్రాఫిక్ నకు అంతరాయం కలుగకుండా వాహనాలను నడుపాలన్నారు. యూనిఫారంను విధిగా ధరించాలన్నారు. రోడ్డు నియమనిబంధనలకు పాటించకపోయినట్లయితే చర్యలు తీసుకోవడం తప్పదని స్పష్టం చేశారు. ట్రాఫిక్ పోలీసులకు ఉచితంగా మజ్జిగ సరఫరా చేయడం, ట్రాఫిక్ నియంత్రణకు దోహదపడే స్థాపర్లను . అందజేసిన కరీంనగర్ డైరీ ఛైర్మెన్ రాజేశ్వరరావును పోలీస్ కమీషనర్ ఎల్ సుబ్బరాయుడు సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏసిపిలు తుల శ్రీనివాసరావు, బి విజయకుమార్, ఇన్స్పెక్టర్లు తిరుమల్, నాగార్జునరావు, కరీంనగర్ డైరీ మేనేజర్ రాజశేఖరెడ్డి, ట్రాలీ డ్రైవర్లు, యజమానులతోపాటు పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement