Thursday, March 28, 2024

చలి నుంచి రక్షణగా విద్యార్థులకు దుప్పట్లు : కలెక్టర్‌ సంగీత

పెద్దపల్లి రూరల్ : జిల్లాలో చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతున్న దృష్ట్యా విద్యార్థుల సౌకర్యార్థం దుప్పట్లను పంపిణీ చేస్తున్నామని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎస్‌. సంగీత సత్యనారాయణ తెలిపారు. మంగళవారం రాత్రి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సంగీత సత్యనారాయణ, అదనపు కలెక్టర్‌ లక్ష్మీ నారాయణతో కలిసి పెద్ద కల్వలలోని బీసీ బాలికల వసతి గృహ విద్యార్థినులకు దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లాలోని 14 వసతి గృహాల్లో గల విద్యార్థిని, విద్యార్థుల సౌకర్యార్థం ప్రాథమిక పాఠశాల నుండి కళాశాల స్థాయి వరకు విద్యార్థులందరికి 1055 బ్లాంకెట్స్‌లను తెప్పించి 8 కళాశాల వసతి గృహాలు, 6 పీ-మెట్రిక్‌ వసతి గృహాలలోని విద్యార్థిని, విద్యార్థులకు పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. ప్రస్తుత ప్రపంచీకరణలో ఇంగ్లీష్‌ స్పికింగ్‌ స్కిల్స్‌, సాప్ట్ స్కిల్‌, ఎంప్లాయిబిలిటి స్కిల్స్‌ చాలా కీలకమని, వీటిని పెంచుకునేందుకు అవసరమైన సహకారం, శిక్షణ విద్యార్థినులకు అందించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ తెలిపారు. ప్రతి వసతి గృహంలో పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేలా అవసరమైన పుస్తకాలు అందుబాటు-లో ఉంచుతామన్నారు. హాస్టల్‌ విద్యార్ధినుల సౌకర్యార్థం హాస్టల్‌ నుండి ప్రధాన రహదారి వరకు రోడ్డు మంజూరు చెస్తున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. అలాగే హస్టల్‌లో కంప్యూటర్‌లు ఏర్పాటు- చేసి సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తామని, అవసరమైన ఇతర అంశాలు సూచిస్తే అందుబాటులో ఉన్న వనరుల మేరకు చర్యలు తీసుకుంటామని అన్నారు. విద్యార్థినులతో కలెక్టర్‌ ముచ్చటిస్తూ హస్టల్‌ లో అందిస్తున్న ఆహార నాణ్యత, మెను, మెష్‌ ఏర్పాటు, పారిశుద్ధ్య ఇతర అంశాలపై చర్చించారు. కాగా, జిల్లాలో ఉన్న 14 వసతి గృహాలలో చదువుతున్న విద్యార్థులందరికీ బ్లాంకెట్ల పంపిణీకి కలెక్టర్‌ ప్రత్యేకంగా 4 లక్షల 32 వేల 550 రూపాయలు నిధులను మంజూరు చేసారు. ఈకార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి జె.రంగా రెడ్డి, జిల్లా ఉపాధి కల్పన అధికారి వై. తిరుపతి రావు, జిల్లా బిసి అభివృద్ధి కార్యాలయ సిబ్బంది, వసతి గృహ సంక్షేమ అధికారి, సిబ్బంది, విధ్యార్థినీలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement