Friday, April 19, 2024

ఉన్నత లక్ష్యంతో ముందుకెళ్లాలి – పెద్దపల్లి డీసీపీ వైభవ్‌ గైక్వాడ్‌

పెద్దపల్లి : విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో ముందుకెళ్లాలని పెద్దపల్లి డీసీపీ వైభవ్‌ గైక్వాడ్‌ సూచించారు. శనివారం జిల్లా కేంద్రంలోని నందన గార్డెన్స్‌లో నిర్వహించిన అవగాహన సదస్సులో మాట్లాడుతూ విద్యార్థిని, విద్యార్థులు తల్లిదండ్రుల ఆశయాలను వమ్ము చేయకుండా చదువుపైనే దృష్టి సారించాలన్నారు. ఉన్నత లక్ష్యంతో ముందుకు సాగితే భవిష్యత్తులో ప్రయోజకులుగా ఎదుగుతారన్నారు. విద్యార్థి దశలో చెడు వ్యసనాలకు పాల్పడితే బంగారు జీవితం బుగ్గి పాలవుతుందన్నారు. పట్టుదలతో వి ద్యాభ్యాసం కొనసాగిస్తే లక్ష్యాన్ని చేరుకుంటారన్నారు. గంజాయితోపాటు ఇతర వ్యసనాలకు పాల్పడితే అనారోగ్యాల బారిన పడడంతోపాటు భవిష్యత్తు అంధకారమవుతుందన్నారు. పెద్దపల్లి ఏసీపీ మహేశ్‌ మాట్లాడుతూ విద్యార్థి దశలో చదువుపైనే దృష్టి సారించాలని, తల్లిదండ్రులు కన్న కలలను నిజం చేసేందుకు కృషి చేయాలన్నారు. కళాశాలల్లో టీవ్‌ టీజింగ్‌, ర్యాగింగ్‌కు పాల్పడితే కఠినచర్యలు తప్పవన్నారు. తెలిసి తెలియని వయసులో ప్రేమ పేరిట ఆకర్షణకు లోనై బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారన్నారు. షీ టీమ్‌లు పూర్తి స్థాయిలో పని చేస్తున్నాయని, మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. ఈకార్యక్రమంలో సీఐలు ప్రదీప్‌కుమార్‌, అనిల్‌కుమార్‌, ఇంద్ర సనారెడ్డి, ఎస్‌ఐ రాజేశ్‌, గాయత్రీ కళాశాల కరస్పాండెంట్‌ శ్రీనివాస్‌తోపాటు గాయత్రీ, వికాస్‌ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement