Sunday, October 13, 2024

Swarnagiri | కన్నుల పండువగా కల్యాణ మహోత్సవం…

ప్రభన్యూస్, ప్రతినిధి /యాదాద్రి : భక్తుల కొంగు బంగారంగా వీరజిల్లుతున్న స్వర్ణగిరి ఆలయంలో ఆదివారం పద్మావతి- గోదాదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామిని మనిమయ శోభిత స్వర్ణాభరణాలతో,సుగంధ భరిత పుష్పమాలలతో అలంకరించి కల్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు.

భక్తులు శ్రీవారి కల్యాణ మహోత్సవాన్ని కన్నులారా తిలకించారు. స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామికి ప్రాతఃకాలంలో సుప్రభాత సేవను ఘనంగా నిర్వహించారు. అనంతరం అరవింద దలయతాక్షుడైన శ్రీ స్వామివారికి ముప్పది మూడు కోట్ల దేవతలు శ్రీ మహాలక్ష్మి అమ్మవారు కొలువై ఉన్న గొప్రుష్ట దర్శనం చేయించారు.

నిత్యారాధనలో భాగంగా వేదమంత్రోచ్ఛారణలతో, మేళతాళ మృదంగ మంగళ ద్వనుల మధ్య బంగారు బావి నుండి సువర్ణ బిందెతో తీర్ధమును తీసుకొచ్చి, స్వామివారిని వేయి నామాలతో స్తుతిస్తూ సహస్రనామార్చన సేవను విశేషముగా నిర్వహించారు. శ్రీ సుదర్శన నారసింహ హవనంను నిర్వహించారు.

భక్తుల పాలిట కొంగుబంగారమైన స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామిని మాడవీధులలో శోభాయ మానంగా ఊరేగిస్తూ భక్తుల గోవింద నామస్మరణలతో, మేళతాళ మృదంగ మంగళ ధ్వనుల మధ్య తిరువీధి ఉత్సవ సేవను ఘనంగా నిర్వహించారు. అనంతరం శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామిని సర్వాలంకార భూషితులై దేదీప్యమానంగా వెలుగుతున్న సహస్ర దీపాల మధ్య ఊయలలో ఆసీనులై భక్తులకు దర్శనమిచ్చారు.

ఆదివారం సెలవు రోజు కావడంతో ఆలయం భక్తులతో కిక్కిరిసి పోయింది. ఆలయ ట్రస్ట్ ఆధ్వర్యంలో సుమారు 5వేల మందికి పైగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. వైభవోత్సవ మండపంలో శ్రీ వాగ్దేవి వాద్య సమస్త బాల బాలికలు కూచిపూడి నాట్య ప్రదర్శన పలువురిని ఆకట్టుకుంది.

- Advertisement -

వేదమంత్రోచ్ఛారణలతో శ్రీ స్వామివారికి మంగళహారతులు సమర్పించగా భక్తులు నయన మనోహరంగా శ్రీవారినీ దర్శించుకున్నారు. స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఆలయ ధర్మకర్తలు మానేపల్లి రామారావు, మురళి కృష్ణ, గోపి కృష్ణలు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement