Sunday, June 4, 2023

బ్రాండెడ్‌ పేరుతో కల్తీ దందా.. రైస్‌ మిల్లులే అడ్డాగా వ్యాపారం.

మహబూబ్‌నగర్‌, ప్రభన్యూస్‌ : తెలంగాణ ప్రాంతంలో అన్నం ప్రతిఒక్కరూ నిత్యం తినే ఆహారం. అన్నం తిననిదే రోజు గడవని పరిస్థితి. ఇదే వ్యాపారులకు వరంగా మారింది. జిల్లాలో బియ్యం విక్రయాలు సైతం కొన్ని కోట్ల రూపాయలు చేతులు మారుతుంది. వివిధ జిల్లాల నుంచి లభించే మంచి నాణ్యమైన బియ్యం పేరుతో ఇక్కడ సంచులను ముద్రించి పేరు మార్చి వివిధ బ్రాండ్ల రూపంలో వ్యాపారం చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రతిరోజు కొన్ని వేల క్వింటాళ్ల బియ్యాన్ని ఇతర జిల్లాలకు తరలిస్తున్నారు. నిబంధనల ప్రకారం సూపర్‌ ఫైన్‌ బియ్యాన్ని కిలో రూ.30 మించి విక్రయించకూడదన్న నిబంధనలు ఉన్నా మార్కెట్‌లో బీపీటీ, హెచ్‌ఎంటీ, జై శ్రీరామ్‌, బియ్యంకు కిలోకు రూ.40 నుండి రూ.60 వరకు అమ్ముతున్నారు. పాత బియ్యానికి ఒక రేటు, కొత్త బియ్యానికి ఒక రేటు చొప్పున ప్రజల అవసరాన్ని బట్టి దుకాణ దారులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. తూకం విషయంలో 25 కిలోల సంచి అని చెబుతున్నా దాని బరువు అంత తూగుతుందో లేదో అన్న అనుమానాలు ఉన్నాయి. కొందరు దుకాణాదారులు రైస్‌ మిల్లర్లతో జతకూడి ప్రభుత్వం అందించే రేషన్‌ బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి వాటిని తిరిగి రైస్‌ మిల్లు ద్వారా పాలీష్‌ చేసి వివిధ బ్రాండ్ల పేరుతో మార్కెట్‌లో అమ్మకాలు సాగిస్దున్నారు. ఇది వరకు బియ్యం విక్రయించాలంటే పౌర సరఫరాల శాఖ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉండేది. గత మూడేళ్ల క్రితం బియ్యం అమ్మకాలపై పౌరసరఫరాల శాఖ నియంత్రణను ప్రభుత్వం తొలగించింది. దీనితో అడ్డూ అదుపు లేకుండా పుట్టగొడుగుల్లా బియ్యం దుకాణాలు పుట్టుకొచ్చాయి. నాణ్యత లోపాన్ని పరీక్షించే శాఖ పక్కకు జరగడంతో వ్యాపారులు నాణ్యత లేని బియ్యాన్ని సైతం ఎక్కువ ధరకు అమ్ముతుండడంతో వినియోగదారులు మోసపోతున్నారు.

రైస్‌ మిల్లులే అడ్డాగా వ్యాపారం..

- Advertisement -
   

జిల్లాలో రైస్‌ మిల్లులే అడ్డాలుగా బ్రాండెడ్‌ బియ్యం వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతున్నా జిల్లా యంత్రాంగం చర్యలకు వెనకాడుతుంది. బియ్యం వ్యాపారం ఇప్పుడు ఏ శాఖ పరిధిలోనిది కాకపోవడంతో బియ్యం వ్యాపారులు ఆడిందే ఆట, పాడిందే పాటగా సాగుతోంది. హాలొ గ్రామ్‌ కలిగి ఉన్నవారు మాత్రమే బియ్యాన్ని అమ్మకాలు చేపట్టాలి. కానీ రైస్‌ మిల్లర్లు ప్రతి ఒక్కరు కూడా ఒక కంపెనీ పేరుతో బియ్యాన్ని విక్రయిస్దున్నారు. కొంతమంది రేషన్‌ బియ్యాన్ని సన్నబియ్యంగా మార్చి విక్రయిస్తున్నారని కూడా ఆరోపణలున్నాయి. అక్రమంగా వివిధ బ్రాండ్ల పేరుతో బియ్యం అమ్మకాలు సాగిస్తున్నా వ్యాపారులపై గతంలో వలె ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి లైసెన్స్‌ ఉన్న వ్యాపారుల మాత్రమే అమ్మకాలు సాగించేలా అధికారులు చర్య‌లు తీసుకున్నపుడే ప్రజలు వ్యాపారుల మోసాల నుండి బయటపడతారు. మోసాలను గమనించిన కొందరు సామాన్యులు నేరుగా రైతువద్దే వడ్లను లేదా బియ్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా వందకుపైగా బియ్యం దుకాణాలు ఉన్నాయి. వీటిలో అధిక శాతం దుకాణాల్లో బియ్యాన్ని కల్తీచేసి విక్రయాలు చేస్తున్నారు. అధికారులు తనిఖీలు నిర్వహించక పోవటంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఎవరైనా బ్యాగ్‌ లోని బియ్యం కల్తీ అయిందని వ్యాపారులను ప్రశ్నిస్తే గొడవలకుసైతం దిగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైన అదికారులు స్పందించి బియ్యం దుకాణాలో విక్రయాలు చేస్తున్న బియ్యాన్ని ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని, వినియోగదారులు కల్తీ బియ్యం బారినపడకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement