Saturday, April 20, 2024

న్యాయవాదుల సహకారంతో కేసుల సత్వర పరిష్కారం

కరీంనగర్ – కేసుల పెండెన్స్ తగ్గి బాధితులకు సత్వర న్యాయం అందాలంటే న్యాయమూర్తులకు న్యాయవాదుల పూర్తి సహకారం అవసరమని బార్ అండ్ బెంచ్ మధ్య పరస్పర సహకారం వల్లే అది సాధ్యమవుతుందని హైకోర్టు జడ్జి( జిల్లా పరిపాలన న్యాయమూర్తి) జస్టిస్ కన్నెగంటి లలిత తెలిపారు. జిల్లా కోర్టు ఆవరణలో నూతనంగా నిర్మించిన డిజిటల్ లైబ్రరీ భవనాన్ని శనివారం జడ్జి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జడ్జి మాట్లాడుతూ కరీంనగర్ బార్ అసోసియేషన్ చైతన్యవంతమైనదని పరిపాలన న్యాయమూర్తిగా కరీంనగర్ కు మొదటిసారి రావడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. తమ కాలంలో లైబ్రరీలు ఎక్కువ లేవని ఇప్పుడు వచ్చిన డిజిటల్ లైబ్రరీలు న్యాయవాదులు వృత్తిలో రాణించేందుకు ఎంతో అవసరమవుతాయాని తెలిపారు. డిజిటల్ లైబ్రరీ ఎంత అవసరమో బుక్స్ చదవటం అంతే అవసరమని దాని ద్వారా నేరుగా గుర్తుండిపోతుందనే విషయాన్ని మరువద్దని తెలిపారు. జిల్లా పరిపాలన జడ్జిగా తన వంతు పూర్తి సహకారాన్ని అందించనున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు.

హైకోర్టు జడ్జి జస్టిస్ ఇవి వేణుగోపాల్ మాట్లాడుతూ కరీంనగర్ బార్ అసోసియేషన్ కు మంచి పేరు ఉన్నదని, ఇక్కడి వారందరూ సోదర భావంతో ఉంటారని తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో కోర్టుల్లో డిజిటలైజేషన్ కు ప్రాధాన్యత పెరిగిందని, డిజిటల్ లైబ్రరీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిజిటలైజేషన్ను అందుబాటులోకి తెచ్చుకోవాలని తెలిపారు.ఇండో ఫారిన్ వ్యవహారాలకు సంబంధించి ఇక్కడివారు అక్కడి దేశాల్లో కేసులు వాదించవచ్చని, అక్కడివారు ఇక్కడికి వచ్చి వాదించవచ్చని ఇది గొప్ప పరిణామ అని తెలిపారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎర్రం రాజారెడ్డి మాట్లాడుతూ జూనియర్ సివిల్ జడ్జి కోర్టుల్లో కేసుల పెండెన్సీ ఎక్కువగా ఉందని మరో నాలుగు కోర్టులు మంజూరు చేయాలని తెలిపారు. రెండు కోర్టులలో జూనియర్ సివిల్ జడ్జిల నియామకం జరపాలని ఈ సందర్భంగా పోర్టుపోలియో జడ్జి దృష్టికి తీసుకొచ్చారు. జిల్లా జడ్జి బి ప్రతిమ, అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి లింగంపల్లి నాగరాజు మాట్లాడారు. అనంతరం హైకోర్టు జడ్జిలను అసోసియేషన్ కార్యవర్గం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు, అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు, సీనియర్ జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement