Saturday, March 23, 2024

Job mela – ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మెగా జాబ్ మేళా…ఎమ్మెల్యే దాసరి

పెద్దపల్లి (ప్రభ న్యూస్) నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యంలో ఆవరణలో మెగా జాబ్ మేళా పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జూన్ 4 వ తేదీ ఆదివారం రోజున మెగా జాబ్ మేళాను పెద్దపల్లి నియోజకవర్గంలోని నిరుద్యోగులందరికీ ఉపాధి మార్గాలను చూపెట్టడం కోసం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇందులో 100 కు పైగా కంపెనీలు 5 వేలకు పైగా ఉద్యోగ అవకాశాలను కల్పించడానికి ముందుకు వచ్చినట్లు తెలిపారు. 10 వ తరగతి, ఇంటర్, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్, ఐటిఐ, డిప్లమా, ఇంజనీరింగ్ విద్యనభ్యసించిన వారికి వివిధ రంగాల్లో ఈ ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నట్లు తెలిపారు. పెద్దపల్లి, కరీంనగర్, మంచిర్యాల, వరంగల్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలలో వివిధ కంపెనీల్లో ఉద్యోగాలను భర్తీ చేయడానికి మెగా జాబ్ మేళా జరుపుతున్నట్లు చెప్పారు.

రైల్వే స్టేషన్ రోడ్ లోని ట్రినిటీ స్కూల్ లో ఉదయం 8 గంటల నుంచి రిజిస్ట్రేషన్లు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతీ యువకులందరూ బంగారు భవిష్యత్తుకు మార్గం వేసుకోవాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు కాసర్ల అనంతరెడ్డి, పెద్దపల్లి ఎంపీపీ స్రవంతి-శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఉప్పు రాజ్ కుమార్, కౌన్సిలర్ లు లైసెట్టి బిక్షపతి, పెంచాల రమాదేవి-శ్రీధర్ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement