Friday, April 19, 2024

సన్నాలకు మారితేనే వడ్ల కొనుగోలు.. లేకుంటే కష్టమే..

ప్ర‌భ‌న్యూస్ : తెలంగాణలో ఉన్న ప్రత్యేక వాతావరణ పరిస్థితుల్లో ఇప్పటివరకు రాష్ట్రంలో పండుతున్న బాయిల్డ్‌ రైస్‌ను కస్టమ్‌ మిల్లింగ్‌ విధానంలో(సీఎంఆర్‌) సేకరించి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం అప్పగిస్తూ వస్తోంది. అయితే 2022 రబీ నుంచి బాయిల్డ్‌ రైస్‌ను కొనుగోలు చేసేది లేదని కేంద్రం తాజాగా స్పష్టం చేసిన నేపథ్యంలో రాష్ట్రంలో బాయిల్డ్‌ రకం నుంచి సన్నాలకు మారేదాకా సీఎంఆర్‌ కింద ధాన్యం సేకరణ ఉండకపోవచ్చని స్పష్టమవుతోంది.

తెలంగాణ నుంచి వెళ్లే సీఎంఆర్‌ బియ్యంలో ప్రధానంగా బాయిల్డ్‌ రైస్‌ ఉండడానికి ఇక్కడి అధిక ఉష్ణోగ్రతలే కారణమవు తున్నాయి. ఈ అధిక ఉష్ణోగ్రతల వల్లే తెలంగాణలో రా రైస్‌( పచ్చి బియ్యం) పండడం లేదు. ఒక వేళ బాయిల్డ్‌ రైస్‌ను రా రైస్‌గా మారిస్తే 30 నుంచి 40 శాతం వరకు నూకలు(బ్రోకెన్‌ రైస్‌) వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తెలంగాణలో ఉన్న ప్రత్యేక వాతావరణ పరిస్థితులను అర్ధం చేసుకోకుండా కేంద్ర ప్రభుత్వం ఈ విధమైన నిర్ణయం తీసుకోవడం సరికాదని రైతులు వాపోతున్నారు.

అయితే ఇటీవలి కాలంలో పారా బాయిల్డ్‌ రైస్‌ అవసరమైన రాష్ట్రాల్లోనూ వాటిని పండించడం పెరిగిందని దీంతో ఆయా రాష్ట్రాల కోసం గతంలోలా బాయిల్డ్‌ రైస్‌ సేకరించడం కుదరదని పేర్కొంటోంది. గత రబీలోనే తెలంగాణ నుంచి తొలుత ఆమోదించిన 24.75 లక్షల మెట్రిక్‌ టన్నులపైన మరో 20 లక్షల టన్నుల బాయిల్డ్‌ రైస్‌ను తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది. అయితే 2021-22 ఏడాది రబీ నుంచి ఒక్క గింజ కూడా బాయిల్డ్‌ రైస్‌ కొనమని కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటిం చింది. బాయిల్డ్‌ రైస్‌కు డిమాండ్‌ తగ్గడం, పీడీఎస్‌ లో ఫోర్టిఫైడ్‌ రైస్ (పోషక విలువలు కలిగిన బియ్యం) పంపిణీ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించడమే ఇందుకు కారణమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement