Saturday, March 25, 2023

బడ్జెట్ లో హైద‌రాబాద్ అభివృద్ధికి నిధులు శూన్యం : శ్రీలత శోభన్ రెడ్డి

కేంద్ర బడ్జెట్ లో హైద‌రాబాద్ అభివృద్ధికి నిధులు శూన్య‌మ‌ని డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి అన్నారు. బుధవారం ప్రవేశపెట్టిన కేంద్రం వార్షిక బడ్జెట్ పై ఆమె స్పందించారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చొరవతో శరవేగంగా అభివృద్ధి పనుల్లో దూసుకుపోతూ.. ఉపాధి కేంద్రంగా విలసిల్లుతున్న హైదరాబాద్ మహానగరానికి కేంద్రం ప్రభుత్వం బడ్జెట్ లో మొండిచేయి చూపిందని డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి అన్నారు.

- Advertisement -
   

అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించేలా తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ ను తీర్చిదిద్దుతుండగా.. మంత్రి కేటీఆర్ పెట్టిన ప్రతిపాదనలు, కోరిన నిధులను కేంద్రం ఇవ్వకపోవడం వివక్షపూరితమేనని చెప్పారు. ఈ సందర్భంగా సామాన్య ప్రజలకు, రైతులకు ఉపయోగం లేని పద్దును తీసుకొచ్చారన్నారు. అభివృద్ధి పనులు, మౌళిక వసతుల కల్పన కోసం పురపాలక శాఖ చేసిన విజ్ఞప్తిని కేంద్రం విస్మరించిందని తెలిపారు. గతంలో వరదల సందర్భంగా ఇబ్బందుల్లో ఉన్న ప్రజలను ఆదుకోవాలని కోరితే వరద సాయం ఇవ్వకుండా హైదరాబాద్ పట్ల నిర్లక్ష్యం చేశారని, ఇప్పుడు కూడా వరద ముంపు నివారణ, మూసి తీర అభివృద్ధికి నిధులు కోరితే మొండిచేయి చూపిందని శ్రీలత శోభన్ రెడ్డి గుర్తు చేశారు. సకల జనులకు ఆలవాలంగా ఉన్న మహానగరంలో ఏ వర్గ ప్రజలకు అనువుగా లేని బడ్జెట్ ను రూపకల్పన చేశారని ఆమె పేర్కొన్నారు. మొత్తంగా కార్పొరేట్లకు కొమ్ముకాసేలా పద్దును ప్రవేశపెట్టారని విమర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement