Thursday, April 18, 2024

భ‌విష్య‌త్ లో ప్ర‌మాదాలు జ‌ర‌గ‌కుండా గోదాముల త‌ర‌లింపు… మంత్రి త‌లసాని

జనావాసాల మధ్య ఉన్న గోదాములను తరలించడం ద్వారా భవిష్యత్ లో ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బుధవారం సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని మినిస్టర్ రోడ్ లో అగ్నిప్రమాదం జరిగిన డెక్కన్ మాల్ భవనంను కూల్చివేయగా, మంత్రి వివిధ శాఖల అధికారులతో సందర్శించారు. ఈ సందర్భంగా స్థానిక కాలనీలో పర్యటించి ఈ ప్రమాదంతో జరిగిన నష్టం గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అగ్నిప్రమాదం వలన తమ ఇండ్లపై ఉన్న సింటెక్స్ ట్యాంక్ లు కాలిపోయాయని, గోడలు నెర్రెలు వచ్చాయని, తదితర విషయాలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన మంత్రి ఇచ్చిన హామీ మేరకు మరమ్మతులు ప్రభుత్వ పరంగా చేపడతామని, ట్యాంక్ లను కూడా కొత్తవి కొనుగోలు చేసి ఇస్తామని కాలనీ వాసులకు చెప్పారు. కాలనీలో పడిపోయిన భవన వ్యర్ధాలను పూర్తి స్థాయిలో తొలగించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సీవరేజ్ లైన్ దెబ్బతిందని స్థానికులు మంత్రి దృష్టికి తీసుకు రాగా, పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

కాలనీలో నూతన రోడ్ల నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. భవనం పూర్తి స్థాయిలో కూల్చివేత పనులు మరో రెండు రోజుల్లో పూర్తవుతాయని చెప్పారు. ప్రమాదం జరిగిన నాటి నుండి తమకు ఏ ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్న మంత్రికి కాలనీ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… పరిసర ప్రజలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా నూతన పరిజ్ఞానంతో భవనం కూల్చివేత చేపట్టినట్లు వివరించారు. భవనం కూల్చివేత కోసం రూ.41 లక్షలను ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు సకాలంలో స్పందించి స్థానిక ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలించి వసతి కల్పించి నాటి నుండి నేటి వరకు భోజన సౌకర్యం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కాలనీలో హెల్త్ క్యాంప్ ను కూడా కొనసాగిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్ లో ఇలాంటి ప్రమాదాలు తిరిగి జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జనావాసాల మధ్య ఉన్న గోదాములను ఇతర ప్రాంతాలకు తరలిస్తామని స్పష్టం చేశారు. గోదాముల నిర్వహకులు సరైన జాగ్రత్తలు పాటించని కారణంగానే ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయన్నారు. మంత్రి వెంట మాజీ కార్పొరేటర్ అత్తిలి అరుణ గౌడ్, RDO వసంత, DC ముకుంద రెడ్డి, తహసీల్దార్ శైలజ, EE సుదర్శన్, టౌన్ ప్లానింగ్ ACP క్రిస్టోపర్, శానిటేషన్ DE శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement