Tuesday, March 26, 2024

రూల్స్ కు పాత‌ర – ఇన్ ఫ్రాల‌కు జాత‌ర‌..

సూర్యాపేట-ఖమ్మం ఫోర్‌లైన్‌ హైవే లోపాల పుట్ట
అనామక, అర్హతలేని కంపెనీలకు.. సబ్‌ కాంట్రాక్టులు
అదానీ నుండి డిఆర్‌ఎన్‌ ఇన్‌ఫ్రాకు సబ్‌ కాంట్రాక్టు
ధీరజ్‌ ఇన్‌ఫ్రా, అల్లం ఇన్‌ఫ్రాల పనులు దారుణం
ప్రజల భద్రతపై భయం… భయం…
మైనింగ్‌ ఆదాయానికి గండి
కేంద్ర సంస్థలు రంగంలోకి దిగాలి
లేకుంటే ప్రమాదాల నిలయంగా హైవే
నిపుణుల హెచ్చరికలు

ఖమ్మం, : కర్నాటకకు చెందిన డీఆర్‌ఎన్‌ ఇన్‌ఫ్రా సంస్థ గ్రీన్‌ఫీల్డ్‌ హైవే నిర్మాణంలో నిబంధనలకు పాతరేసింది. అంతా నా ఇష్టం అంటూ విలువైన ప్రభుత్వసంపదను కొల్లగొడుతోంది. రాష్ట్ర మైనింగ్‌ ఆదాయానికి గండిపెడుతోంది. రాష్ట్రంలోని సూర్యాపేట- ఖమ్మం గ్రీన్‌ ఫీల్డ్‌ హైవే నిర్మాణపు పనుల్లో నాణ్యతాలోపాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తుండగా, నిర్మాణలోపాలతో ఈ హైవే భద్రత, భవిష్యత్తుపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వందల కోట్లతో చేప ట్టిన రోడ్డు నిర్మాణంలో ఎన్‌హెచ్‌ఏఐ అధికారుల పర్యవేక్షణ పూర్తిగా కొరవడింది. రోడ్డు నిర్మాణంలో సిబ్బందితో పర్యవేక్షణ చేయిస్తూ జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం గ్రీన్‌ ఫీల్డ్‌ హైవే నిర్మాణం ఏళ్ల తరబడి మన్నికతో ఉండే విధంగా చేపట్టాల్సిన అధికారులు డీఆర్‌ఎన్‌ ఇన్‌ఫ్రా దానికి అనుబందంగా ఉన్న మరికొన్ని ఊరూపేరూలేని

అనామకసంస్థలతో లాలూచీపడ్డారన్న ఆరోపణలు తీవ్రస్థాయిలో వినిపిస్తున్నాయి. ఆమ్యామ్యాలకు కక్కుర్తి పడుతూ హైవేలో ఆ సంస్థ చేస్తున్న అక్రమాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా భాగస్వాములు అవుతున్నారనే ఆరోపణలు వినిపి స్తున్నాయి. వాస్తవానికి ఈ కాంట్రాక్ట్‌ ఆదానీ ఇన్‌ఫ్రాకు దక్కగా, వారు డీఆర్‌ఎన్‌ ఇన్‌ఫ్రా అనే అనుభవం, అర్హతలేని కంపెనీకి సబ్‌ కాంట్రాక్టు ఇచ్చారు. ఈ సబ్‌ కాంట్రాక్ట్‌ తీసుకున్న డీఆర్‌ఎన్‌ ఇన్‌ఫ్రా క్షేత్రస్ధాయిలో చేసిన వీరంగానికి, అనామక కంపెనీలతో కలిసి రోడ్డును నాణ్యతాలేమితో ఇష్టానుసారంగా నిర్మిస్తున్న పద్దతికి స్థానిక ప్రజలే విస్తుపోతూ తరచూ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన ధీరజ్‌ ఇన్‌ ఫ్రా కాంట్రాక్టు సంస్థతో పాటు అల్లం ఇన్‌ ఫ్రా తదితర సంస్థలు కూడా సబ్‌ కాంట్రాక్టులు తీసుకుని చేపడుతు న్న పనులన్నీ అడ్డగోలుగా, నిబంధనలకు విరుద్దంగా సాగుతు న్నాయన్న ఆరోపణలున్నాయి. ఒకవైపు నిబంధనలకు నీళ్ళొ దులుతూ.. మరోవైపు చారిత్రక దేవాలయాలను, కట్టడాలను కనుమరుగు చేస్తూ ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో రోడ్డు నిర్మాణసంస్థలు ఆందోళనకర పరిస్థితులకు కారణమవుతున్నాయి.
అక్రమాల హైవే..
సూర్యాపేట-ఖమ్మం గ్రీన్‌ఫీల్డ్‌ హైవే 4 లైన్ల నిర్మాణ పనులు చేపట్టేందుకు బిల్డ్‌ ఆపరేట్‌ ట్రాన్స్‌పర్‌ (నిర్మించి, నిర్వహించి, అప్పగించే) పద్దతిలో రూ.1150 కోట్ల రోడ్డు నిర్మాణ పనులను అదాని ఇన్‌ ఫ్రా సంస్థ దక్కించుకుంది. 4 లైన్లతో రోడ్డు నిర్మాణం సకాలంలో చేపట్టి బీఓటీ పద్దతిలో టోల్‌ ఫ్లాజాల ద్వారా సొమ్ములు చేసుకునేందుకు కాంట్రాక్టు ఒప్పందాన్ని కేంద్ర ప్రభుత్వం ద్వారా పొందిన అదాని ఇన్‌ ఫ్రా ప్రాజెక్టు సంస్థ ఇచ్చిన అగ్రిమెంట్‌ ప్రకారం పనులు చేపట్టకుండా కర్నాటకకు చెందిన డీఆర్‌ఎన్‌ (డీఆర్‌ నాయక్‌) ఇన్‌ ఫ్రా కాంట్రాక్టు సంస్థకు అప్పగించి చేతులు దులిపేసుకుంది. తెలంగాణా రాష్ట్రంతో ఏమాత్రం సంబంధం లేని కర్ణాటక డీఆర్‌ఎన్‌ ఇన్‌ ఫ్రా కాంట్రాక్టు సంస్థ సూర్యాపేట-ఖమ్మం గ్రీన్‌ ఫీల్డ్‌ హైవే నిర్మాణ పనులు చేసే శక్తి సామర్ధ్యాలు లేక రోడ్డును 3, 4 కిలోమీటర్ల నుండి 5, 10 కిలోమీటర్ల వరకు బిట్లు బిట్లుగా, ముక్కలు ముక్కలుగా చేసి మట్టి పనులు కొందరికి, సిమెంట్‌ పనులు కొందరికి, వాగులు, కాల్వల బ్రిడ్జిలు కొందరికి, అండర్‌ టన్నెల్‌లు ఇతర పనులు మరికొందరికి అంటూ పనికిరాని అనామక సంస్థలకు, కనీస అర్హత లేని కాంట్రాక్టర్లకు సబ్‌ లీజులకు ఇచ్చేయడంతో అడ్డగోలుగా అక్రమాలు సాగుతూ ఎటువంటి రాయల్టిd ఫీజులు, అనుమతి చార్జీలు చెల్లించకుండా, అనుమతులు పొందకుండా మట్టి, గుట్టలు, కొండలను లూటీ చేస్తున్నారు. దీంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌గడ్‌, ఒడిస్సా రాష్ట్రాల రాకపోకలకు.. అత్యంత కీలకమైన హైవే పనులు ఎప్పటికి ఎలా పూర్తవుతాయి.. ఇంత అధ్వాన్నంగా పనులు జరుగుతున్న రోడ్డుపై ప్రజల ప్రాణాల భద్రతకు ఎవరు హామీనిస్తారు? అని ప్రజలు మండిపడుతున్నారు. దీనిపై సంబంధిత అథారిటీలు స్పందించి.. తక్షణమే తనిఖీలు చేపట్టాలని, అక్రమాల దందాకు, అర్హతలేని కాంట్రాక్టు సంస్థల లీలలకు చెక్‌ చెప్పాలని కోరుతున్నారు.
మైనింగ్‌ ఆదాయానికి గండి
జిల్లాలో ఎక్కడా మైనింగ్‌ లీజులు పొందకుండా కనీస ఎన్‌ఓసిలు లేకుండా సబ్‌ కాంట్రాక్టర్లు ఖమ్మం జిల్లాలో అక్రమాలకు పాల్పడుతూ మైనింగ్‌ శాఖ ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రావాల్సిన కోట్లాది రూపాయల రాయల్టిd ఆదాయానికి గండికొడుతున్నారు. కోట్లు చెల్లించకుండా మట్టిని లూటీచేస్తూ దోపిడీకి పాల్పడుతున్నారు. దీంతో డీఆర్‌ఎన్‌ ఇన్‌ఫ్రా, దాని అనుబంధ అనామక కంపెనీలపై రాష్ట్ర మైనింగ్‌ అధికారులకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.
ఎన్నో లోపాలు.. ప్రజలకు శాపాలు
జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) సారధ్యంలో గ్రీన్‌ఫీల్డ్‌ హైవే నిర్మాణం చేపట్టిన అదాని ఇన్‌ ఫ్రా సంస్థ డీఆర్‌ఎన్‌ సంస్థకు పనులు అప్పగించడం, ఆ సంస్థ అనామక, పనికిరాని సబ్‌ కాంట్రాక్టర్లకు పనులు అప్పగించడంతో నిబంధనలకు విరుద్దంగా, నాసిరకంగా రోడ్డు నిర్మాణ పనులు సాగుతున్నాయి. జాతీయ రహదారిగా నిర్మిస్తున్న నాలుగువరుసల రోడ్డులో ప్రభుత్వ, జాతీయ రహదారుల సంస్థ నిబంధనలు ఏవీ అమలుకాకపోవడం విశేషం. ఎంతో పెద్ద ప్రాజెక్టుగా చేపట్టిన హైవే పనుల్లో అడ్డగోలు వ్యక్తులు, సంస్థలు పనులు ఇష్టారాజ్యంతో నల్లరేగడి, చవుడు మట్టితో చేపడుతున్నా ఎన్‌హెచ్‌ఏఐ సంస్థ అధికారులు కాని, విజిలెన్స్‌ అధికారులు కాని, క్వాలిటీ విభాగం అధికారులు కాని అటువైపు దృష్టి పెట్టిన పరిస్థితి లేదు. రోడ్డు నిర్మాణ పనులు చేస్తున్న సబ్‌ కాంట్రాక్టు సంస్థలకు ఉన్న అనుమతులు, అర్హతలు ఏమిటో, అనుభవాలు ఏమిటో పరిశీలిస్తే ఏ ఒక్క సంస్థకు, వ్యక్తులకు ఎటువంటి అనుమతులు లేకపోవడం విశేషం.
అదాని కాంట్రాక్టు సంస్థ, కేంద్రంలో ప్రాధాన్యత కల్గిన సంస్థ , ఒక మంత్రికి చెందినది అంటూ అటు డీఆర్‌ఎన్‌ ఇన్‌ఫ్రా, ఇటు అనామక కాంట్రాక్టర్లు ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో సహజ వనరులుగా ఉన్న మట్టి గుట్టలను, చెరువులను లూటీ చేస్తున్నారు. రోడ్డు నిర్మాణంలో, ఫార్మేషన్‌లో నల్లరేగడి, చవుడు మట్టి పోసి రోలింగ్‌ చేస్తున్నా పట్టించుకునే నాధుడు లేరంటే అతిశయోక్తి లేదు. అధికారుల పర్యవేక్షణలో చేపట్టాల్సిన రోడ్డు పనులు పూర్తిగా అధ్వాన్నంగా సాగుతున్నాయి. చెరువుల నుండి నల్ల మట్టిని తరలించి, 25 నుండి 30 అడుగుల లోతు గోతులు తీస్తూ ప్రమాదకరంగా మార్చారన్న విమర్శలు వినబడుతున్నాయి. ప్రభుత్వం, ఎన్‌హెచ్‌ఐఏ ఉన్నతాధికారులు నిరంతరం పర్యవేక్షణ జరిపే రీతిలో రోడ్డు నిర్మాణపు పనులు చేపట్టాలని కోరుతున్నారు. ప్రజల ప్రాణాలు అదాని ఇన్‌ఫ్రా చేతిలో పెట్టడం దారుణమన్నారు. ఈ హైవేతో తమకు సంబంధంలేదని రాష్ట్ర రోడ్లుభవనాల శాఖ అధికారులు అంటున్నారు. ప్రజల భద్రత కోసం కేంద్ర ఏజెన్సీలు రంగంలోకి దిగకుంటే.. భవిష్యత్తులో ఈ రోడ్డుపై చాలా దారుణ ప్రమాదాలు జరిగే సంకేతాలున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఒకవైపు వేస్తుంటే మరోవైపు పగిలిపోతున్న రోడ్డు
జాతీయ రహదారి నిర్మాణంలో పరిశీలిస్తే లోపాలు అనేకం స్పష్టంగా కనిపిస్తున్నాయి. చాలా చోట్ల రోడ్డు ఒకవైపు నుండి నిర్మించుకుంటూ పోతుంటే.. మరోవైపు నుండి పగులుతూ.. నెర్రెలు బారి కనిపిస్తోంది. తల్లంపాడు వద్ద నిర్మిస్తున్న అండర్‌ టన్నెల్‌ బ్రిడ్జికి ఇరువైపులా రోడ్డుకు పడిన పగుళ్లు అందుకు నిదర్శనం . ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన ధీరజ్‌ ఇన్‌ ఫ్రా కాంట్రాక్టు సంస్థతో పాటు అల్లం ఇన్‌ ఫ్రా తదితర సంస్థలు చేపడుతున్న పనులన్నీ అడ్డగోలుగా, నిబంధనలకు విరుద్దంగా సాగుతున్నాయన్న ఆరోపణలున్నాయి. వేల కోట్లతో, బీఓటీ పద్దతిలో జరుగుతున్న ఈ పనులపై ప్రభుత్వాలు, జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌ఐఏఐ) ప్రధానంగా దృష్టి సారించి సబ్‌ కాంట్రాక్టులను, అనమాక సంస్థలను తొలగించడం ద్వారా రోడ్డు ప్రమాణాలు పెంచి భవిష్యత్‌లో ఇబ్బందులు, ప్రమాదాలు జరగకుండా కాపాడాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement